Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 5:50 pm Posted by : ramakrishna

చదువును ఆయుధంగా మల్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

 

. . . విద్యార్థి దశలో కష్టపడితే… జీవితమంతా సుఖ సంతోషాలే

 

. . . బీసీ వసతి గృహ విద్యార్థులకు ‘ప్రేరణ’ కల్పించిన కలెక్టర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

విద్యార్థి దశలో ఏకాగ్రతతో ఇష్టపడి చదువుకుంటే, జీవితమంతా సంతోషమయంగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. విద్యను ఆయుధంగా మల్చుకుని,  ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హితవు పలికారు. ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలకు చెందిన పదవ తరగతి విద్యార్ధిని, విద్యార్ధులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ప్రేరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్, విద్యార్థులకు పదవ తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధతపై దిశా నిర్దేశం చేశారు. ఉన్నత చదువు చదివి జీవితంలో స్థిరపడేందుకు పదవ తరగతి మొదటి మెట్టు అని అన్నారు. ఆరంభంలోనే తప్పటడుగు వేస్తే అది భవిష్యత్తును దెబ్బతీస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా వార్షిక పరీక్షలకు అన్ని విధాలా సంసిద్దులు కావాలని సూచించారు.

 

Use education as a weapon and scale higher heights.
Use education as a weapon and scale higher heights.

ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం వసతి గృహాల్లో అనేక వసతులు అందుబాటులోకి వచ్చాయని, ప్రభుత్వం కూడా పేద విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అనేక విధాలుగా తోడ్పాటును అందిస్తోందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలన్నారు.  వార్షిక పరీక్షలు సమీపించినందున చదువు పైనే దృష్టిని కేంద్రీకరించాలని, ఇతర వ్యాపకాల వైపు దృష్టి పెడితే విలువైన సమయాన్ని కోల్పోతారని అన్నారు. చదువు కష్టంగా అనిపించిన ప్రతీసారి తల్లితండ్రులు పడే కష్టాన్ని గుర్తు చేసుకుని మరింత కసి, పట్టుదలతో చదవాలని హితబోధ చేశారు. పాఠాలను బట్టీ పట్టకుండా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటే అది జీవితాంతం పనికి వస్తుందని ఉద్బోధించారు.  ముఖ్యంగా బాలికలు మరింత పట్టుదలతో రాణించాలని, తల్లితండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. ప్రైవేట్ స్కూల్స్ తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందించేందుకు నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రభుత్వ బడుల్లో చదివే వారు ఏ విషయంలోనూ వెనుకబడి ఉండరని విద్యార్థుల్లో కలెక్టర్ ఆత్మవిశ్వాసం కల్పించారు. చక్కగా చదువుకుని అందరూ 10 గ్రేడ్ పాయింట్స్ సాధించాలని, జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేయాలన్నారు. పది పరీక్షల్లో ప్రతిభను చాటితే బిగ్ స్క్రీన్ పై టి.20 వరల్డ్ కప్ లైవ్ మ్యాచ్ చూసేలా ఏర్పాట్లు చేయిస్తానని విద్యార్థులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. పరీక్షలు సమీపించిన ప్రస్తుత తరుణంలో సమయం ఏమాత్రం వృధా కాకుండా విద్యార్థులకు పునఃశ్చరణ జరిపించాలని ఉపాధ్యాయులకు, సంక్షేమ వసతి గృహాల నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు. చక్కటి వాతావరణంలో విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకునేందుకు వీలుగా అనువైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న, వసతి గృహాల నిర్వాహకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

 

 

Use education as a weapon and scale higher heights.
Use education as a weapon and scale higher heights.