. . . వినియోగదారుల సంక్షేమ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సందు ప్రవీణ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
డెయిరీ పాలలో జరుగుతున్న కల్తీపై విచారణ జరిపి సత్వరమే తగు చర్యలు తీసుకోవాలని ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సందు ప్రవీణ్ తెలిపారు. ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి మహాదేవుని శ్రీనివాస్ లు కలిసి గురువారం ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 1న హన్మకొండలోని కుమార్ పెళ్లి మార్కెట్ ప్రాంగణంలో నిర్వహించిన ఆహార కల్తీ నిరోధక చైతన్య కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బ్రహ్మాజీ సంచార ఆహార ప్రయోగశాల (మొబైల్ ఫుడ్ టెస్టింగ్ లాబొరేటరి) స్కానింగ్ యంత్రం ద్వారా వివిధ పాల నమూనాలను పరీక్షించారన్నారు. ఆ పరీక్షలలో కరీంనగర్ డెయిరీ, ఆరోక్య డెయిరీ సంస్థలకు చెందిన ఫుల్ క్రీమ్ మిల్క్ లో ఫ్యాట్ శాతం నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నట్లు ధృవీకరించబడిందన్నారు. ఇది వినియోగదారుల హక్కులకు విరుద్ధంగా ఉండి, ప్రజారోగ్యానికి హానికరమయ్యే అవకాశం ఉన్నదని, అందువల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంబంధిత అధికారుల ద్వారా సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకొని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లా లో ప్రతీ రోజు 50 వేల లీటర్ల పాలు అమ్మకం జరుగుతుంటే, అందులో 42 వేల లీటర్లు ప్రవేటు డెయిరీ లు, ఆరు వేల లీటర్లు విజయ డెయిరీ, మిగతా రెండు వేల లీటర్లు చిన్న చిన్న రైతు డెయిరీ ల ద్వారా అమ్మకం జరుగుతున్న క్రమంలో పాల నాణ్యతపై టెస్ట్ చెక్ నిర్వహించడం అవసరమని పేర్కొన్నారు.