Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 1:57 pm Posted by : ramakrishna

రైతుల అవసరాలకు సరిపడా అందుబాటులో యూరియా ఎరువులు

. . .కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

. . . ఎరువుల గిడ్డంగి ఆకస్మికంగా తనిఖీ

 

. . .డ్రోన్ ద్వారా నానో యూరియా వినియోగం ప్రయోగాత్మక పరిశీలన

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ  :

 

జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల విషయంలో ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి భరోసా కల్పించారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. గిడ్డంగిలో అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలను, స్టాక్ రిజిస్టర్, ఈ పాస్ యంత్రం ద్వారా ఎరువుల అమ్మకాల వివరాలు పరిశీలించారు. ఎరువుల కొనుగోలు కోసం వచ్చిన రైతులను కలెక్టర్ పలకరించి, సరిపడా ఎరువులు అందుతున్నాయా అని ఆరా తీశారు. యాసంగి సీజన్ కు సంబంధించి జిల్లాలో పూర్తి స్థాయిలో యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, కోరిన మేరకు ఎరువుల స్టాక్ ను జిల్లాకు పంపుతున్నారని, ప్రస్తుత యాసంగిలోనే కాకుండా వచ్చే ఖరీఫ్ సీజన్ కు సైతం ఎరువుల కొరత ఉండబోదని కలెక్టర్ రైతులకు సూచించారు. అన్ని ప్రాంతాలలో రైతులకు ఎరువులు అందేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని, సహకార సంఘాలు లేని చోట రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేసేలా, పంట సాగు చేస్తున్న ప్రతి రైతుకు ఎరువులు అందేలా చూస్తామని స్పష్టం చేశారు.

Urea fertilizer available to meet farmers' needs

అయితే రైతులు ఒకేసారి ఎరువులను కొనుగోలు చేసి అట్టిపెట్టుకోకుండా, తమ అవసరాలకు అనుగుణంగా దశల వారీగా ఎరువులు తీసుకోవాలని హితవు పలికారు. మోతాదుకు మించి ఎరువులు వాడవద్దని హితవు పలికారు. నానో యూరియా వాడకంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ శివారులో ఓ ఆదర్శ రైతు పంట పొలంలో డ్రోన్ ను వినియోగిస్తూ నానో యూరియా ఎరువును పిచికారీ చేస్తున్న విధానాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులతో కలిసి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. నానో యూరియా వినియోగంపై ఆసక్తి కలిగిన రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్, జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్ రావు, మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ, స్థానిక అధికారులు ఉన్నారు. 

Urea fertilizer available to meet farmers' needs