- వలస నేతలకు ఆలయ పాలక మండళ్ల డైరెక్టర్ పదవులపై క్యాడర్ భగ భగ
- పోలీస్ స్టేషన్ కు చేరిన అర్బన్ కాంగ్రెస్ నేతల బాహాబాహీ పంచాయతీ
- తనయుడి కోసం రాజీనామాకు సిద్ధపడ్డ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్
నిజామాబాద్, బతుకమ్మ : యువ కాంగ్రెస్ నాయకులు ఒకరిని ఒకరు విమర్శించుకుని, బాహాబాహీకి దిగిన ఘటన నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ లో చిచ్చు రేపింది. ఓ యువ కాంగ్రెస్ నాయకుడు ఆకుల మహేందర్ ఇటీవల నగరంలో దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో ఇతర పార్టీ నేతలకు డైరెక్టర్ పదవులు ఎలా ఇచ్చారనే విషయంలో మరో యువనేత అంతరెడ్డి విజయ్ పాల్ రెడ్డితో డిస్కషన్ పెట్టడం.. అక్కడ గొడవ జరుగడం.. వారిలో ఓ యువ నేత పీసీసీ చీఫ్ కు ఫోన్ చేయడంతో పోలీసులు ఆగమేఘాల మీద మరో యువ నాయకుడిని పోలీస్ స్టేషన్ లో గంటల తరబడి ఉంచిన వ్యవహరం అర్బన్ కాంగ్రెస్ ను అతలాకుతలం చేసింది. దాదాపు మూడు రోజుల పాటు హైటెన్షన్ ఓల్టేజ్ తో అర్బన్ రాజకీయంలో తనయుడి కోసం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రాజీనామా అస్త్రం ప్రయోగించగా, ఈ వివాదం సద్ధుమనిగించేందుకు నుడా చైర్మెన్, ఉర్ధు అకాడమీ చైర్మెన్, పీసీడీ డెలిగేట్ రంగంలోకి దిగిన, పోలీసులు మాజీ మంత్రి మాటలను పట్టించుకోకుండా యువనేతను పోలీస్ స్టేషన్ నుంచి విడిచిపెట్టడానికి ససేమీరా అన్న వ్యవహరం గుప్పుమంది. చివరకు రూరల్ నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత నివాసంలో రెండు వర్గాలు రాజీకి రావడంతో అర్బన్ గ్రూప్ రాజకీయాలలో జరిగిన వివాదం తాత్కాలికంగా సద్ధుమణిగింది.
నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ లో ఇటీవల పలు ఆలయాలకు పాలక మండళ్ల నియామకంతో వేడెక్కింది. ప్రధానంగా పార్టీకోసం కష్టకాలంలో పనిచేసిన వారు, పార్టీని వీడకుండా దశాబ్ధన్నర కాలంగా పనిచేస్తున్న వారిని కాదని ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్, బీజేపీల నుంచి వలస వచ్చిన వారికి పదవులు (డైరెక్టర్) లుగా నియమించడం క్యాడర్ లో తీవ్రమైన ఆసంత్రుప్తితో రగిలిపోతున్నారు. అది చాలదన్నట్టు ఇటీవల కాంగ్రెస్ సంస్థాగత పదవుల భర్తీకి పార్టీ పరిశీలకుల వద్ద దరఖాస్తులు చేసుకోవడంతో అర్బన్ కాంగ్రెస్ లో నిప్పు రాజేసింది. మొన్నటి వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి రూరల్ కు కేటాయిస్తారని, నిజామాబాద్ సిటీ ప్రెసిడెంట్ బీసీకి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇటీవల రాజకీయ సమీకరణాలు మారిపోయి జిల్లా పరిశీలకుడుగా వచ్చిన అజ్మతుల్లా హుస్సేన్ వద్ద కొత్త ముఖాలు సిఫారసులతో పార్టీ నగర అధ్యక్ష పదవికి దరఖాస్తులు చేయడంతో పార్టీ క్యాడర్ కుతకుతమని ఉడికిపోతున్నారు. వారసులమని, సిఫారసు లీడర్లు వచ్చి గద్దెల మీద కూర్చుంటామంటే పార్టీ కోసం పనిచేసిన వారి పరిస్థితి ఏమిటని పార్టీ నాయకులపై దుమ్మెత్తి పోస్తున్నారు. జిల్లా పర్యటన చేసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు పలువురు పరస్పర పిర్యాదులు చేసుకోవడంతో గ్రూప్ రాజకీయాలు బట్ట బయలు అయ్యాయి.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపై కాంగ్రెస్ నేతల పెత్తనం ఎవ్వరిది అనే విషయం ఆ పార్టీ క్యాడర్ లో స్పష్టత లేదు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థీ షబ్బిర్ అలీ ఓటమి చెందడంతో ఈ నియోజకవర్గంపై ఆయనే ఇంచార్జీగా కొనసాగుతున్నారు. షబ్బీర్ అలి కామారెడ్డి , నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలపై పట్టుకోసం లోకల్ లీడర్లను నమ్మిన ప్రయోజనం లేకుండా పోయింది. ఐతే పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఉర్ధు అకాడమీ చైర్మెన్ తాహేర్ బిన్ హందాన్ , నుడా చైర్మెన్ కేశ వేణులు అర్బన్ కేంద్రంగా క్రీయా శీల రాజకీయాలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కుడా అర్బన్ కేంద్రంగా రాజకీయాలను శాశిస్తుండగా అయనకు నగరంలో అనుచరులు ఉన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గం పెత్తనం పై అధిష్టానం, లోకల్ లీడర్లు తామే సుప్రీం.. తమకు ఎదురు లేదన్నట్లు వ్యవహరించడంతో నాయకులు, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. ఇటీవల ఊర పండగకు ముందు నగరంలో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన వివాదం చిలికి చిలికి గాలి వానాల మారి అర్బన్ కాంగ్రెస్ లో నిప్పు రాజేసింది. తనయుడి కోసం జిల్లా గ్రంథలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి రాజీనామాకు సిద్ధపడగా, మాజీ మంత్రి సుధర్శన్ రెడ్డి జోక్యం చేసుకున్న వివాదం సద్ధుమనుగలేదంటే అర్బన్ రాజకీయం గమ్మత్తుగా ఉన్న విషయం వెల్లడైంది. పేరుకు అందరు కాంగ్రెస్ లీడర్లే కాని ఎవ్వరికి వారు వెనుక గోతులు తీసుకుంటున్నారని, కోవర్టు రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలుస్తున్నారు అనే ఆరోపణలతో పాటు విమర్శల మూటగట్టుకున్నారు. దానితో అసలు పార్టీలో అర్బన్ లో ఎవ్వరి ఆధ్వర్యంలో పనిచేయాలనే సంశయాలు ఉండగా లీడర్లు కుర్చీల కోసం కోట్లాడుతు క్యాడర్ ను పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది. ఇదిలా కొనసాగితే రాబోయే బల్ధియా ఎన్నికలలో కాంగ్రెస్ కు మళ్లీ మూడో స్థానం అనే పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.