Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 September 2024, 4:44 pm Posted by : ramakrishna

హోం గార్డులకు అందని వేతనాలు

. పేరుకే పోలీసుశాఖ పరిధిలో ఉద్యోగం

. పండుగల వేళ పస్తులు

. బైఫరికేషన్ పేరుతో ఉమ్మడి జిల్లాలో బదిలీలు

పోలీసు శాఖ పరిధిలో పని చేస్తున్న హోం గార్డుల పరిస్థితి అధ్వానంగా మారుతోంది. కుటుంబ బాధ్యతలనూ పక్కన పెట్టిశాఖకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే హోంగార్డులకు ఆగస్టు నెలకు సంబంధించిన వేతనాలు ఈ నెల 20వ తేదీ వస్తున్నా ఇప్పటికీ అందలేదు. పండుగల వేళ ఎవరికి తమ బాధ చెప్పుకోవాలో తెలియని పరస్థితి ఏర్పడింది. వేతనాలు అందకపోయినప్పటికీ ఈ నెలలోనే గణేశ్ నవరాత్రులు, నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ విధులు నిర్వర్తించారు.

నిజామాబాద్, బతుకమ్మ : హోం గార్డులది పేరుకే పోలీసుశాఖలో ఉద్యోగం. వేతనం తప్ప ఎలాంటి అలవెన్సు లేని ఆ చిన్న జీవితాలకు ఇప్పుడు వేతనాలూ సకాలంలో అందడం లేదు. ఒకప్పటి ఆర్డిలరీ వ్యవస్థ కోసం పుట్టిన హోంగార్డ్ ఉద్యోగం పోలీస్ శాఖలో అవుట్ సోర్సింగ్ వంటిది. కానిస్టేబుళ్లలా యూనిఫాం వేసుకున్నా రోజుకు 12 గంటల విధులు నిర్వర్తిస్తే వారికి వచ్చే జీతం ఏ మూలకు సరిపోదు. నెలకు వచ్చే రూ.28 వేల జీతంతోనే అన్ని సర్దుకోవాలి. ఈ నెల 20వ తేదీ వస్తున్నా ఇప్పటికీ జీతం అందలేదు. రాష్ట్రంలో 16,000 మంది హోంగార్డులు ఉండగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 800 మందికిపైగా హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి నెలా 5వ తేదీన వేతనాలు వస్తున్నప్పటికీ ఆగస్టు నెలకు సంబంధించిన  వేతనాలు ఈ నెల 20వ తేదీ వస్తున్నా అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గణేశ్ మండపాల వద్ద, నిమజ్జన శోభాయాత్రలో విధులు నిర్వర్తించిన హోంగార్డులు.. పండుగను పస్తులతోనే గడపాల్సి వచ్చింది. దాదాపు 50 రోజుల క్రితం వచ్చిన వేతనం గడిచిన నెలకే పరిమితం కాగా సెప్టెంబర్ మాసంలో ఎలాంటి ఆదాయం లేని సగటు వేతన జీవులైన హోంగార్డులకు కొత్త కష్టాలను తెచ్చి పెట్టింది. అప్పుసొప్పులు చేసుకున్న వాటికి ప్రతి నెలా చెల్లించే ఈఏంఐ లు చెల్లించలేక చెక్ బౌన్స్ లు, ఎక్స్ట్రా పేమెంట్లు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన తీపి కబురు మాత్రం అందలేదు. పోలీస్ అధికారులు మాత్రం తాము హోంగార్లకు సంబంధించిన వేతనాల బిల్లులను పంపామని ఆర్బీ ఐ నుంచే అనుమతులు రాలేదని చేతులెత్తిస్తున్నారు. వేతనాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోయినప్పటికీ గణేష్ నవరాత్రుల బందోబస్తుకు హోంగార్డులు తరలి వెళ్లారు. దాదాపు రెండు వారాలు చేసే పనికోసం వారికి రూ.2వేల చొప్పున చేతిలో పెట్టగా, వాటితోనే కుటుంబానికి, తమకు అవసరమైన వాటిని సమకూర్చకున్నారు. హోంగార్డులకు వేతనాలు సరిగా అందకపోయినా వారిని మాత్రం ఇంటర్ డిస్ర్టిక్ట్ లో అంటే పాత ఉమ్మడి జిల్లాలో బదిలీలు మాత్రం బై ఫరిగేషన్ పేరుతో జరగడం నిత్యకృత్యమైంది. పోలీస్ శాఖలో హోంగార్డు వ్యవస్థ అంటేనే ఆర్డినరీ వ్యవస్థకు పేరు మోసింది. హోంగార్డులు పోలీస్ స్టేషన్ లో డ్రైవర్లు, ఇంటి పనితోపాటు సార్ల పనులు చేయాల్సిందే. వేతనాలు అందక సతమతమవుతున్న హోంగార్డులు పండుగల వేళ మంది ముఖం చూడాల్సిన పరిస్థితి ఉంది.