Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 November 2024, 4:08 pm Posted by : ramakrishna

ఏడు నెలలుగా అందని జీతాలు

. ఇబ్బందుల్లో జెడ్పీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు

. కలెక్టర్ ప్రత్యేకాధికారిగా ఉన్నా తమకీ పరిస్థితి అంటూ వాపోతున్న వైనం

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా పరిషత్ లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న సిబ్బందికి నెలల తరబడి వేతనాలు అందడం లేదు. ఇలాగైతే తమ జీవనం ఎలా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  జెడ్పీ పాలకవర్గం ఉన్న సమయంలో తమకు వేతనాలు త్వరగా వచ్చేవని అంటున్నారు.

ఏడు నెలలుగా..

ఉద్యోగులు, సిబ్బంది ఒక నెల వేతనం రాకపోతేనే అల్లాడిపోతుంటారు. అలాంటిది సుమారు ఏడు నెలలుగా జీతాలు రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోడానికి సాధ్యం కాకుండ ఉంది. ఔట్ సోర్సింగ్ లో విధులు నిర్వహించేవారంటే చులకనగా ఉందని తమ బాగోగులు పట్టించుకునేవారే లేరనే నిస్సహాయత భాధితులలో నెలకొంటోంది. జిల్లా పరిషత్ లో ఒక కంప్యూటర్ ఆపరేటర్, ముగ్గురు వాచ్ మెన్లు, ఇద్దరు డ్రైవర్లు ఔట్ సోర్సింగ్ విధానంలో సుమారు 20 ఏళ్లపైబడే విధులు నిర్వహిస్తున్నారు.

జీవనం సాగేదెలా..?

నెలల తరబడిగా జీతాలు ఇవ్వకపోవడంతో బతుకు బండి సాగక అప్పుల పాలవుతున్నారు. నెల కాగానే జీతం వస్తుందని నమ్మకంతో ఇంటి అవసరాల నిమిత్తం తెలిసిన వారి దగ్గర చేయి చాపాల్సి వస్తోంది. ఒక నెల అటూఇటుగా వేతనాలు వచ్చిన ఎలాగోలా నెట్టుకువచ్చే వారిమని, నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగికి ఉండే సౌకర్యాలు తమకేమీ ఉండవని, ఇచ్చే జీతం సరిగా ఇస్తే సరిపోతుందంటున్నారు.

కలెక్టర్ పై ఆశలు

చైర్మన్ పదవి నుంచి దిగిన తర్వాత ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రత్యేకాధికారి పాలనలో జీతాలు తొందరగా వస్తాయనుకుంటే నెలల తరబడిగా రావడం లేదని, ఆయనపైనే తమ ఆశలని అంటున్నారు. కలెక్టర్ స్పందించి తమకు వేతనాలు చెల్లించాలని అవుట్ సోర్సింగ్ సిబ్బంది కోరుతున్నారు.