నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో శనివారం యునివర్సిటీ లోని వివిధ సంఘాల జేఏసీ నాయకులు సమావేశం నిర్వచించారు. ఈ కార్యక్రమంలో వారు కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్-మెదక్-అదిలాబాద్- కరీంనగర్ పట్టభద్రుల అభ్యర్థి డాక్టర్ వి.నరేందర్ రెడ్డి కి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడు సాగర్ నాయక్ మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల కోసం మరో యుద్ధం చేసి బీఆర్ఎస్ పార్టీని గద్దెదించి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో నిరుద్యోగుల, విద్యార్థుల పాత్ర కీలకమైనదని తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నిరుద్యోగుల ఆకాంక్షల నెరవేరేలా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అదేవిధంగా 54,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి 2025-జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగుల పక్షాన ఈ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడు మద్దతు ఉంటుందని తెలిపారు. కరీంనగర్-నిజామాబాద్-మెదక్ అదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి.నరేందర్ రెడ్డి కి యూనివర్సిటీ విద్యార్థుల సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. విద్యారంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ వి.నరేందర్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించి శాసనమండలికి భారీ మెజారిటీతో పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన శక్తి, ఎం.ఎస్.ఎఫ్, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.