- రాష్ట్రంలోనే తెలంగాణ విశ్వవిద్యాలయం అగ్రభాగాన ఉంది
- రాష్ట్ర గవర్నర్, చాన్స్ లర్ జిష్ణు దేవ్ వర్మ

డిచ్ పల్లి, బతుకమ్మ : కొఠారి కమిషన్ లో చెప్పినట్లుగా దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే తీర్చిదిద్ద పడుతుందనేది విశ్వవిద్యాలయ విజయాలు రుజువు చేస్తున్నాయన్నాయని రాష్ట్ర గవర్నర్ చాన్సలర్, విశ్వ విద్యాలయాల కులపతి జిష్ణు దేవ్ వర్మ అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవం బుధవారం యూనివర్సిటీలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హజరైన జిష్ణూ దేవ్ వర్మ మాట్లాడుతు… రాష్ట్రం పేరుతో ఏర్పాటుచేసిన తెలంగాణ విశ్వవిద్యాలయానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని గర్వంగా చెప్తున్నానని తెలిపారు. రాష్ట్రంలోనే తెలంగాణ విశ్వవిద్యాలయం అగ్రభాగాన ఉందని అన్నారు. చైతన్యవంతమైన ఈ మట్టిలోని ప్రజల ఆకాంక్షలు, సామర్ధ్యాలు విశ్వవిద్యాలయ అభివృద్ధిలో స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం సాధించిన విజయాలు విశేషమైన ప్రగతి పూర్వకమైన సంఘటనలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. 2006లో ఆరు కోర్సులతో ప్రారంభమై నేడు ఏడు విభాగాలలో 24 ఉపవిభాగాలుగా 31 కోర్సులతో బిక్నూరు, సారంగపూర్ క్యాంపస్ లతో సహా ఇక్కడ ప్రధాన క్యాంపస్ లో విద్యా వికాసం చెందడం ఆనందంగా ఉందని తెలిపారు. గడిచిన 19 సంవత్సరాల కాలంలో ఇక్కడి అధికారులు అధ్యాపకులు, విద్యార్థులు పరిశోధకుల ఉమ్మడి కృషి అంకితభావం ప్రతిబింబిస్తుందన్నారు. స్నాతకోత్సవ ఏర్పాట్లు కేవలం విద్యాపరమైన లక్ష్యసాధన మాత్రమే కాదని విశ్వవిద్యాలాయంలో నాణ్యమైన, సాంకేతిక విద్య , ఉపాధి కల్పించే భవిష్యత్ ప్రయాణానికి మార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. 2023-24 రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం 51 శాతం పట్టభద్రులు దేశానికి నైపుణ్యాల కొరత తీరుస్తూ ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. ఈ విశ్వవిద్యాలయం అనేకమైన ఆశాజనకమైనటువంటి పారిశ్రామిక విద్యాపరమైన సంబంధాలతో ముందుకు పోవడం స్వాగతించాల్సిందన్నారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పినట్లు విద్య యొక్క అంతిమ లక్ష్యం సృజనాత్మకమైన మానవుని తయారు చేయడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ చారిత్రాత్మకమైన అభివృద్ధిని స్పృశించడం అని పేర్కొన్నారు.
- విశ్వవిద్యాలయం విడిన అభ్యర్థి అవకాశాల వైపు పరుగెత్తాలి : భారత రసాయన శాస్త్ర సాంకేతిక సంస్థ మాజీ డైరెక్టర్ ఆచార్య శ్రీవారి చంద్రశేఖర్

విశ్వవిద్యాలయం నుండి బయటకు వెళ్లిన ప్రతి విద్యార్థికి ఆందోళనతో పాటు అవకాశాలు కనిపిస్తాయి అన్నారు. ఆందోళన చెందకుండా అవకాశాల వైపు పరిగెత్తాలని భారత రసాయన శాస్త్ర సాంకేతిక సంస్థ మాజీ డైరెక్టర్ ఆచార్య శ్రీవారి చంద్రశేఖర్ అన్నారు. వర్తమాన కాలంలో అనేక అవకాశాలతో విద్యార్థులు తమ నైపుణ్యాలను, కౌశలాలను, అభిరుచులను ఉపయోగించుకొని అనేక రకాలుగా స్థిరపడే అవకాశం ఉందన్నారు. వారి వారి శక్తి సామర్థ్యాల మేరకు, అభిరుచి మేరకు కొందరు పరిశోధకులుగా, మరికొందరు పారిశ్రామికవేత్తలుగా, వ్యవస్థాపకులుగా, ప్రజాసేవకులుగా, విద్యావేత్తలుగా, ఉన్నతంగా స్థిరపడుతున్నరన్నారు. విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది జీవితమనేది పందెం లాంటిది కాదని ఇది ఒక ప్రయాణం మాత్రమేనని గుర్తు చేశారు. ఈ ప్రయాణానికి సమయస్ఫూర్తి లోతైన అధ్యయనంతో పాటు తీసుకునే నిర్ణయాలు మీద భవిష్యత్ నిర్ణయం జరుగుతుందని తెలిపారు.
- సమీప భవిష్యత్తులో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తా : తెయూ విసి ఆచార్య యాదగిరి రావు

తెలంగాణ విశ్వవిద్యాలయంలో సమీప భవిష్యత్తులో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని తెయూ విసి ఆచార్య యాదగిరి రావు హామీ ఇచ్చారు. పరిపాలనా భవనం 500 మంది విద్యార్థినిలకు అన్ని రకాల వసతులు ఉండే విధమైన బాలికల హాస్టల్ ను, వెయ్యి మంది కెపాసిటీతో ఉండే ఆడిటోరియం అన్ని హంగులతో క్రీడా మైదానం అభివృద్ధి లాంటి భవిష్యత్ ప్రణాళికలను రూపొదించి అమలు చేస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయం విస్తరణలో భాగంగా విశ్వవిద్యాలయ పరిధిని నిజామాబాదు, కామారెడ్డి నుండి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు విస్తరించే కృషి చేస్తానన్నారు. ఈ విశ్వవిద్యాలయ మౌలికమైన అభివృద్ధి, ప్రజా ప్రతినిధులతో పాటు బోధన బోధనేతర సిబ్బంది యొక్క కృషి మీదనే ఆధారపడుతుందని తెలియజేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మకమైన రెండవ స్నాతకోత్సవం విజయవంతం మైందని వైస్ -ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు తెలిపారు.

- 156 మంది పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్ పట్టాల పంపిణీ…
తెలంగాణ విశ్వ విద్యాలయం రెండవ స్నాతకోత్సవం సంధర్బంగా విశ్వ విద్యాలయంలో చదివిన పరిశొధక విద్యార్ధులకు గవర్నర్, చాన్స్ లర్ జిష్ణూదేవ్ వర్మ 15 విభాగాలలో 2014 నుండి 2023 వరకు 132 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు. 156 మంది పరిశోధకులకు డాక్టరేట్ పట్టాలను అందజేశారు.
ఈ స్నాతకోత్సవంలో రాజ్య సభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుధర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డిలతో పాటు జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణ రెడ్డి, పోలీస్ కమీషనర్ సాయి చైతన్య, ట్రైని కలెక్టర్ తో పాటు రిజిస్ట్రార్ అచార్య యాదగిరి, డీన్స్ ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్, ప్రొఫెసర్ అపర్ణ, ప్రొఫెసర్ రాంబాబు , ప్రొఫెసర్ లావణ్య, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ప్రొఫెసర్ హారతి, ప్రొఫెసర్ నాగరాజు, ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ విద్యావర్ధిని, ప్రో.అరుణ, ప్రొఫెసర్ నాగరాజు, పాత పిఆర్వో డైరెక్టర్ డా. ఏ పున్నయ్య లతో పాటు బోధన బోధ నేతర సిబ్బంది పాల్గొన్నారు.
