Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 8:56 pm Posted by : ramakrishna

మహిళా కోటాపై కేంద్ర కేబినెట్ నిర్ణయం ఏకపక్షం

 

. . . మహిళా కోటాలో ఓబీసీ సబ్ కోటా కోసం జాగృతి ఉద్యమిస్తుంది

 

. . . తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

మహిళా కోటాపై కేంద్ర కేబినేట్ నిర్ణయం ఏకపక్షమని, మహిళా కోటాలో ఓబీసీ సబ్ కోటా కోసం జాగృతి ఉద్యమిస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళ బిల్లు కోసం జాగృతి మొదలుపెట్టిన పోరాటం ద్వారా యావత్ దేశ మహిళలకు మేలు జరిగే పరిస్థితి వచ్చిందని, మనం వెలిగించిన దీపం ద్వారా మహిళ బిల్లుకు ముందడుగు పడిందన్నారు. ఈ బిల్లు కోసం ఢిల్లీలో నేను చేసిన దీక్షకు పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు తరలివచ్చారని, అదే విధంగా 18 పార్టీలను కో ఆర్డినేట్ చేసి వారు దీక్షలో పాల్గొనేలా చేశామని తెలిపారు. మహిళ బిల్లు కోసం జాగృతి ద్వారా కేంద్రంపై రాజకీయ ఒత్తిడి పెట్టామని, ఫలితంగా మహిళ బిల్లు వచ్చిందని, ఈ బిల్లు రావటంలో జాగృతి పాత్రను మరవలేమని అన్నారు. కానీ బిల్లుకు సంబంధించిన ప్రయోజనం మాత్రం పోస్ట్ డేటేడ్ చెక్ మాదిరిగా ఉందని ఆనాడే నేను చెప్పానని, బీసీ ఆడబిడ్డలకు కోటా లేకుండానే ఈ బిల్లు పాస్ చేశారన్నారు. డిలిమిటేషన్ ను మహిళ బిల్లుకు ముడిపెట్టి పాస్ చేశారని, దీంతో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో, అదే విధంగా ఆ తర్వాత జరిగిన 12 రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలకు బిల్లు ప్రయోజనం రాలేదన్నారు. ఇప్పుడు 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్నారని, దీని కారణంగా మళ్లీ మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు. 2027 జనాభా గణనన తర్వాతే రిజర్వేషన్లు ప్రకటించాలని, అదే విధంగా ఈసారి జన గణనలో బీసీల లెక్క తీస్తామంటున్నారని, ఆ లెక్క తేలిన తర్వాత బీసీ మహిళలకు కూడా సబ్ కోటా ఇవ్వాలని పేర్కొన్నారు. వెంటనే డ్రాఫ్ట్ బిల్లును అన్ని పార్టీలకు అందజేయాలని, బిల్లు పెట్టే రోజు ఉదయమే బిల్లు ప్రతులను ఇస్తామని చెబుతున్నారని, దీని కారణంగా అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండదన్నారు. బీజేపీ ఎప్పటిలాగే తమ మోసపూరిత వైఖరి అవలంభించాలని ప్రయత్నిస్తోందని, ఈ బిల్లు విషయంలో 2027 జనాభా లెక్కల వరకు ఆగాలని పోరాటం చేయాల్సి ఉందని, ఇందుకోసం బీసీ బిడ్డలంతా కదలాలని తెలిపారు. డ్రాఫ్ట్ బిల్లు అంశంతో పాటు 2011 జనాభా లెక్కలు ఆధారంగా చేసుకుంటామన్న బీజేపీ వైఖరిని ఖండిస్తున్నామని, ఈ అంశంపై గతంలో మాతో కలిసి వచ్చిన 18 పార్టీలో నాయకులతో నేను మాట్లాడుతానని, మహిళలమందరం మనం సాధించుకున్న ఈ బిల్లులోని హక్కులను కచ్చితంగా సాధించుకోవాలని కవిత పేర్కొన్నారు.