Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 8:38 pm Posted by : ramakrishna

నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై టౌన్–1 పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్‌లోని సులబ్ కాంప్లెక్స్ సమీపంలో సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల ఓ గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. వెంటనే వారు 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది వ్యక్తిని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న టౌన్–1 పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రాథమిక విచారణలో సరైన ఆహారం, విశ్రాంతి లేకపోవడం, తీవ్ర ఎండల ప్రభావంతో ఆరోగ్యం క్షీణించి మృతి చెందిన అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు టౌన్–1 పోలీసులు వెల్లడించారు. ప్రస్తుత వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లవద్దని, తగినంత నీరు, ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని టౌన్–1 ఎస్‌హెచ్‌ఓ ప్రజలకు సూచించారు.