Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 January 2025, 3:29 pm Posted by : ramakrishna

ప్రజలకు సమాధానం చెప్పలేకనే..

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:    ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోబడిన ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనకుండా ప్రభుత్వం పైనే నిందలు వేయడం చూస్తుంటే విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు.  టిఆర్ఎస్ అధికారంలో ఉన్న చివరి రెండు సంవత్సరాలలో పెండింగ్లో ఉంచిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుంటే వాటిని పంచే కార్యక్రమంలో వేల్పూర్, భీమ్గల్,ముప్కల్, కమ్మరపల్లి ప్రాంతాలలో ప్రశాంత్ రెడ్డిని ప్రజలు ప్రశ్నించినందుకే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నీ బహిష్కరిస్తున్న అని చెప్పి ప్రశాంత్ రెడ్డి పక్కకు తప్పుకుంటున్నారని అన్నారు. ఒకవేళ ప్రశాంత్ రెడ్డి తులం బంగారం ఇవ్వడం లేదు అని చెక్కుల పంపిణీ బహిష్కరిస్తే గడిచిన సంవత్సర కాలంగా ఎందుకు చెక్కులు పంపిణీ చేశారో చెప్పాల్సిన బాధ్యత ప్రశాంత్ రెడ్డి పైన ఉందని ప్రశ్నించారు. గ్రామాలలో మహిళలు ప్రశాంత్ రెడ్డిని నిలదీసి గతంలో మీరు అధికారంలో ఉన్న రెండు సంవత్సరాలలో ఎందుకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయలేదు అని ప్రశ్నించడంతో వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియని ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పై నిందలు మోపి పక్కకు తప్పుకుంటున్న అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రశాంత్ రెడ్డి తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రశాంత్ రెడ్డికి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే సమయం కూడా లేదు అందుకే గత మూడు నెలల క్రితం మంజూరైన చెక్కులను కూడా బాల్కొండలో ఇప్పటివరకు పంచలేదని విమర్శించారు. ఎందుకంటే చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ప్రశాంత్ రెడ్డి ముందుకు వస్తే ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారో ఎక్కడ తప్పులు బయట పడతాయో అని భయంతోనే ప్రశాంత్ రెడ్డి పక్కకు తప్పుకున్నాడని అన్నారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి వచ్చిన రాకున్నా ప్రజలకు మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల సమయం ముగియకముందే అధికారులు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ,ప్రశాంత్ రెడ్డి చేసిన నిర్లక్ష్యం వల్లనే రెండు సంవత్సరాలు లబ్ధిదారులకు చెక్కులు రాకుండా ఆలస్యం అయ్యాయని తెలిపారు. కావున వెంటనే ప్రశాంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల లబ్ధిదారులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్, బిజెపి చెప్పే అబద్ధపు మాటలను ప్రజలు నమ్మవద్దని గతంలో వారు నిర్లక్ష్యంతో పెండింగ్లో ఉంచిన చెక్కులను, బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తూనే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని తెలిపారు.