నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం మ్యాథమెటిక్స్ విభాగంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న పద్మ ఉమ్మెడ ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మిజోరాం నుండి మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో డాక్టరేట్ సాధించారు. “మిక్స్డ్ కన్వెక్షన్ ఆఫ్ విస్కో ఎలాస్టిక్ హైబ్రిడ్ నానో ఫ్లూయిడ్స్ ఇన్ పారలెల్ ప్లేట్ చానల్స్: ఎంట్రోపీ జనరేషన్ అనాలసిస్” అన్న అంశంపై తాను సమర్పించిన థీసిస్ కు సంబంధించి ఫైనల్ వైవా సమర్థవంతంగా డిఫెండ్ చేసుకోవడం ద్వారా ఎన్ ఐ టి మిజోరం నుండి డాక్టరేట్ సాధించారు. ఎన్ఐటి మిజోరం మ్యాథమెటిక్స్ విభాగంలో సహాయ ఆచార్యునిగా పనిచేస్తున్న డాక్టర్ ఓ .సురేందర్ పర్యవేక్షణలో పరిశోధన చేసి పద్మ ఉమ్మెడ పీహెచ్డీ సాధించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఇస్సపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ రైతు కుటుంబంలో పుట్టిన పద్మ ఆర్మూర్ లో ప్రాథమిక విద్యాభ్యాసం, నిజామాబాదులో డిగ్రీ, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయం మ్యాథమెటిక్స్ విభాగంలో 2014 నుండి గత పదకొండు సంవత్సరాలుగా సహాయ ఆచార్యురాలు (కాంట్రాక్ట్) గా పని చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి ఒక ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా డాక్టరేట్ సాధించడం పట్ల యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి .యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎం యాదగిరి, సైన్స్ డీన్, మ్యాథమెటిక్స్ విభాగం అధిపతి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అభినందనలు తెలిపారు.