హైదరాబాద్, బతుకమ్మ :
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి చేసిన ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ) ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని ఎన్‌పీఏ అధికారికంగా వెల్లడించింది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు మేరకు ఏర్పాటు చేసిన ప్రివిలేజ్ కమిటీ కేసుపై సమగ్ర విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్‌లు, సంబంధిత ఆధారాలను పరిశీలించిన కమిటీ, వేధింపులకు సంబంధించిన ఆరోపణలు నిజమేనని నిర్ధారణకు వచ్చినట్లు ఎన్‌పీఏ తెలిపింది. కమిటీ సిఫార్సుల మేరకు ఉదయ్ కృష్ణారెడ్డిని ఎన్‌పీఏ నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. అయితే, ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ సేవల్లో కొనసాగాలా లేదా అనే అంశంపై తుది నిర్ణయం కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ (డీఓపీటీ) తీసుకుంటుందని ఎన్‌పీఏ స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రివిలేజ్ కమిటీ నివేదికను డీఓపీటీకి పంపనున్నట్లు వెల్లడించింది. ఈ వ్యవహారంపై డీఓపీటీ నిర్ణయం వెలువడిన తర్వాత తదుపరి పరిపాలనా చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
. . . ఆత్మహాత్యాయత్నానికి పాల్పడ్డ ట్రైనీ ఐపీఎస్
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ కృష్ణారెడ్డి సోమవారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గత సాయంత్రం అమీర్ పేట్ లోని స్నేహితుల ఇంట్లో ఉదయ కృష్ణారెడ్డి మద్యం సేవించారు. అనంతరం మోతీనగర్ లోని సోదరుడి ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం ఆయన అపస్మారక స్థితిలో కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఎస్ ఆర్ నగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మద్యంలో విషపదార్థం కలిపి సేవించినట్లు వైద్యులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించారనే ఆరోపణలపై అత్తాపూర్ పోలీసులు ఆదివారం ఉదయ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆత్మహత్యాయత్నానికి కొద్దిసేపటి ముందు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన మరుసటి రోజే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది.