- లక్షల క్యూసెక్కుల వరద
- గేట్లన్నీ ఎత్తి లక్ష క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణకు సాగు, తాగునీరందించే నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు నిండాయి. వర్షాకాలంలో పొరుగున ఉన్న మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు రెండు ప్రాజెక్టులు ఆదివారం రాత్రి వరకే నిండిపోయాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో లక్షా 80 వేల ఎకరాలకు సాగునీరందించే నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆదివారం రాత్రి రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు రాత్రి వరద పోటెత్తడంతో 11 గంటల ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు, ప్రాజెక్టు అధికారులు కలిసి 7 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆదివారం రాత్రి 17.802 టీఎంసీలకు గాను నిజాంసాగర్ ప్రాజెక్టులో 14.162 టీఎంసీల నీరు వచ్చి చేరింది. 90 వేల క్యూసెక్కుల వరద రావడంతో రాత్రికి రాత్రే గేట్లను ఎత్తి 58,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. సోమవారం ఉదయం 13 గేట్లను ఎత్తిన అధికారులు సాయంత్రానికి 15 గేట్లను ఎత్తివేశారు. దాదాపు లక్ష క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో లక్షా 25 వేల క్యూసెక్కుల నీటిని మంజిరా నదిలోకి వదిలారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టును భారీ వరద ముంచేత్తుతుంది. ఆదివారం వరకు ప్రాజెక్టులో 80.5 టీఎంసీలకు గాను 71.470 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సోమవారం తెల్లవారుజాము వరకు లక్షా 51 వేల 932 క్యూసెక్కుల వరద వచ్చింది. ఉదయం 10:40 నిమిషాలకు 9 గేట్లను ఎత్తిన అధికారులు 25 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. దాదాపు 51 వేల 867 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినా ఇన్ ఫ్లో మాత్రం తగ్గలేదు. మధ్యాహ్నానికి 24 గేట్లను ఎత్తిన అధికారులు 75 వేల క్యూసెక్కులను దిగువకు వదిలారు. 1:30 నిమిషాల ప్రాంతంలో 34 గేట్లను ఎత్తిన అ
ధికారులు లక్షా 25 వేల క్యూసెక్కులను నీటిని దిగువకు వదిలారు. తర్వాత వాటిని 39 గేట్లకు పెంచారు. సాయంత్రానికి 39 గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని వరద నీళ్ళ ద్వారానే దిగువకు వదిలారు. ఇందిర్మ కాలువ ద్వారా 18 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4700 క్యూసెక్కులు మొత్తంగా 2,26,867 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలుతున్నారు.
- 4 యూనిట్లు 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి..
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని నాలుగు యూనిట్ల ద్వారా 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని జెన్ కో డీ ఈ ఈ శ్రీనివాస్ తెలిపారు. కాకతీయ, ఏస్కైప్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుందని చెప్పారు. దీంతో ఉత్పత్తి కేంద్రంలో నాలుగు యూనిట్లు ఉంటే యూనిట్-1 ద్వారా 9 మెగావాట్ల, యునిట్ – 2 ద్వారా 9 మెగావాట్ల, యూనిట్-3 ద్వారా 9 మెగావాట్ల, యూనిట్ -4 ద్వారా 9 మెగావాట్ల లు మొత్తం 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
