Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 9:53 pm Posted by : ramakrishna

హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్

 

. . . కారు, ఆయుధాలు స్వాధీనం

 

సదాశివనగర్, బతుకమ్మ :

 

వ్యక్తిగత కక్షలతో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో సదాశివనగర్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్‌హెచ్‌ఓ పుష్పరాజ్ వెల్లడించారు. ధర్మారావుపేట గ్రామానికి చెందిన గైని రమేష్ ఈ నెల 27వ తేదీ రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన కారుతో ఢీకొట్టి కిందపడేశారు. అనంతరం కారులో నుంచి దిగిన నిందితులు చెక్క కర్రతో రమేష్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచేందుకు ప్రయత్నించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. విచారణలో ధర్మారావుపేటకు చెందిన గాండ్ల లావణ్య, ఆమె సోదరుడు గాండ్ల సతీష్ ఈ దాడికి పాల్పడినట్లు తేలింది. గతంలో ఉన్న వివాదాల కారణంగా రమేష్‌పై దాడికి పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి దాడికి ఉపయోగించిన మారుతి 800 కారు, చెక్క కర్ర, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరినీ కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ పుష్పరాజ్ మాట్లాడుతూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు వివాదాలను చట్టపరమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని సూచించారు.