Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 6:11 pm Posted by : ramakrishna

అక్రెడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్‌కు ప్రాతినిధ్యం కల్పించాలి

 

. . . తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్రంలోని జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీల్లో (డీఎంఏసీ) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్)కు ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జర్నలిస్టు సంఘాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని న్యాయస్థానం స్పష్టం చేసింది. అక్రెడిటేషన్ కమిటీల ఏర్పాటు సందర్భంగా అర్హత కలిగిన టీడబ్ల్యూజేఎఫ్‌కు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేసే సమయంలో తమ సంఘానికి స్థానం కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గత ఆరు నెలలుగా విచారణ కొనసాగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కార్యాలయ న్యాయవాదులు, పిటిషనర్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వ ఉత్తర్వులు, అక్రెడిటేషన్ కమిటీల ఏర్పాటు విధానం, జర్నలిస్టు సంఘాల ప్రాతినిధ్యానికి సంబంధించిన నిబంధనలను పరిశీలించిన అనంతరం హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహినుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు ప్రకటిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్‌కు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పుతో జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్‌కు అధికారిక ప్రాతినిధ్యం లభించే అవకాశం ఏర్పడింది. జర్నలిస్టు సంఘాల మధ్య సమాన అవకాశాలు, పారదర్శకత, న్యాయబద్ధమైన ప్రాతినిధ్యానికి ఈ తీర్పు దోహదపడుతుందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హైకోర్టు తీర్పును టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకత్వం స్వాగతించింది. జర్నలిస్టుల హక్కులు, గౌరవం, సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కోసం సాగించిన పోరాటానికి ఇది న్యాయపరమైన విజయమని పేర్కొంది. తీర్పును వెంటనే అమలు చేసి అన్ని జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరింది. “న్యాయం, ధర్మం తమవైపే ఉన్నాయని హైకోర్టు తీర్పు మరోసారి నిరూపించింది. ఈ విజయం టీడబ్ల్యూజేఎఫ్ సభ్యులందరిదీ” అని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య తెలిపారు. భవిష్యత్తులో మీడియా అక్రెడిటేషన్ కమిటీల ఏర్పాటు సమయంలో గుర్తింపు పొందిన అన్ని జర్నలిస్టు సంఘాలకు సముచిత ప్రాధాన్యం కల్పించే దిశగా ఈ తీర్పు మార్గదర్శకంగా నిలుస్తుందని జర్నలిస్టు వర్గాలు పేర్కొంటున్నాయి.