నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు కోసం దశాబ్ధాలుగా రైతులు ఉద్యమిస్తున్నారని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి కేంద్రం నిజామాబాద్ లో ఏర్పాటు చేశారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలపై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు తక్షణం వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. విజ్ఞత లేకుండా ఎంపి మాట్లాడిన తీరును ఖండిస్తున్నాం అని తెలిపారు. పసుపు రైతుల కృషి వల్లే పసుపు బోర్డు ఏర్పాటు జరిగితే పసుపు రైతులు లేకుండా బోర్డు ప్రారంభించడం మూర్ఖత్వం అన్నారు. ఎలాంటి విధివిధానాలు లేకుండా, ఓ హోటల్ లో పసుపు బోర్డు ప్రారంభం ఏంటి అని ప్రశ్నించారు. పసుపు బోర్డు అంబాసిడర్ కారు తో పోల్చిన ఎంపీ ప్రస్తుతం ఏర్పాటు చేసిన బోర్డు పై ఇప్పుడు ఏం చెబుతారు అని అన్నారు. స్పై సెస్ బోర్డు పక్కనే.. పసుపు బోర్డు ఏర్పాటు చేసి ప్రకటనలకు పరిమితం చేయవద్దు అని ఎమ్మేల్యే కోరారు. త్వరలో బిఆర్ఎస్ మూత పడటం ఖాయం అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో నిజామాబాద్ మార్కెట్ కమిటి చైర్మెన్ ముప్పా గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్, మునిపల్లి సాయిరెడ్డి, బాగారెడ్డి తదితరులు ఉన్నారు.