రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ
ఈనెల 21, 22 తేదీల్లో నగరంలో సభలు
నిజామాబాద్, బతుకమ్మ : టీయూసీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ పిలుపునిచ్చారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర ప్రథమ మహాసభల వాల్ పోస్టర్లను నగరంలోని ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలను రద్దుచేసే కుట్రలను కేంద్రప్రభుత్వం చేస్తుందన్నారు. అందులో భాగంగానే కార్మిక అనుకూల చట్టాలను కుదించి, 4 లేబర్ కోడ్ లను తీసుకొస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. టీయూసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయుసీఐ) తెలంగాణ రాష్ట్ర మహాసభలను జిల్లా కేంద్రంలో ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహిస్తున్నామన్నారు. మొదటి రోజు ర్యాలీ బహిరంగ సభ 2వ రోజు ప్రతినిధుల సభ నిర్వహిస్తామన్నారు. ఈ మహాసభలకు టీయూసీఐ జాతీయ నాయకులు, వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఈ మహాసభల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తామని, గత పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు పోరాటాల రూపకల్పన చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు డి.రాజేశ్వర్ జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లేష్ జిల్లా నాయకులు సాయన్న, కిరణ్ నాయకులు చరణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.