Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 9:21 pm Posted by : ramakrishna

ట్రాలీ ఆటో చోరీ కేసు ఛేదన

 

. . . అంతర్ జిల్లా నేరస్తుడు అరెస్ట్

కామారెడ్డి, బతుకమ్మ :

 

రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ట్రాలీ ఆటో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దొంగిలించబడిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అంతర్ జిల్లా అలవాటు నేరస్తుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్‌కు చెందిన తోట నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. ఇస్సన్నపల్లి గ్రామానికి చెందిన భూమ్పల్లి నరేష్‌కు చెందిన బజాజ్ ట్రాలీ ఆటో (నెం. ఏపి25ఎక్స్7950)ను జూన్ 23 రాత్రి పోసాని పేట గ్రామంలోని రైస్ మిల్ షెడ్డు వద్ద నిలిపి ఉంచగా, మరుసటి రోజు ఉదయం అది కనిపించకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, రామారెడ్డి ఎస్‌ఐ మురళి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా జులై 4 న నిర్వహించిన వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న కానుగుల అలియాస్ కుమ్మరి రాజు (మంచిప్ప గ్రామం, మోపాల్ మండలం, నిజామాబాద్ జిల్లా) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను ట్రాలీ ఆటోతో పాటు ఇతర ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లను కూడా దొంగిలించినట్లు అంగీకరించాడు. నిందితుడు తన సహచరుడు గోత్రాల నాగరాజుతో కలిసి నిజామాబాద్, దేవునిపల్లి ప్రాంతాల్లో పలు వాహన దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది. దొంగిలించిన వాహనాలను పొలాల్లో దాచిపెట్టి తరువాత విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే పోలీసులు అతడిని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి దొంగిలించబడిన బజాజ్ ట్రాలీ ఆటో (ఏపి25ఎక్స్7950)తో పాటు ఒక స్మార్ట్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను గతంలో కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో పలు ఆస్తి నేరాల్లో నిందితుడిగా ఉన్న అలవాటు నేరస్తుడని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సహనిందితుడు గోత్రాల నాగరాజు ఇప్పటికే మరో కేసులో జైలులో ఉన్నట్లు సమాచారం. కేసును వేగంగా ఛేదించిన పోలీస్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.