Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 1:19 pm Posted by : ramakrishna

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు నివాళ్ళు

 

ఇందూర్, బతుకమ్మ :

సాయుధ పోరాట యోధురాలు, బీసీల నిప్పు కణిక, ధీశాలి చాకలీ ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా వినాయక నగర్ లోని హనుమాన్ జంక్షన్ లో గల వీర నారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద బిసి సంక్షేమ సంఘం నాయకులు గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. బీసీలు తిరగబడితే దేన్నైనా సాధించవచ్చని ఐలమ్మ చరిత్రే నిదర్శనమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ అన్నారు. ఇప్పటికైనా బీసీలు మేలుకొని తమను తాము పరిపాలించుకోవాలని, ఆ రోజు దేశ్ముఖ్ లను, రజాకార్లకు పరిగెత్తించిన ఐలమ్మ యొక్క తెగింపును వారసత్వంగా బీసీలు ఎంచుకుని ముందుకు సాగాలని బీసీ సంక్షేమ సంఘం పిలుపునిచ్చారు. ఒక్క వీరనారి కొన్ని వేల ఎకరాల భూమిని ప్రజలకు చెందే విధంగా చూడడం ఒక గొప్ప విషయమని, తన నాలుగు ఎకరాల భూమిని కాపాడుకోవడమే కాకుండా వేల మందికి భూమి చెందే విధంగా చూసిన నాయకురాలు గొప్ప ధీశాలి చాకలి ఐలమ్మ అన్నారు. ఆమె చివరి శ్వాస వరకు కూడా బడుగు బలహీన వర్గాల కొరకు శ్రమించిందని, ఆమె బాటలో పయనించి బీసీలు తమ హక్కులను సాధించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్, కరిపే రవిందర్,కొయ్యడ శంకర్ బగ్గలి అజయ్,శ్రీలత, కొట్టూర్ చంద్రకాంత్, రేఖ, దేశాయి గంగాధర్ సురేందర్ గూపనపల్లి, శంకర్, సాయిలు, చంద్రయ్య  తదితరులు పాల్గొన్నారు.