Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 9:52 pm Posted by : ramakrishna

ఫారెస్ట్ అధికారుల వేధింపులతో గిరిజన రైతు ఆత్మహత్యాయత్నం

 

. . . అధికారిని సస్పెండ్ చేయాలని సీపీఎం డిమాండ్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం షేర్ శంకర్ తండాకు చెందిన ఓ గిరిజన రైతు ఫారెస్ట్ అధికారుల వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతును సీపీఎం నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కే. చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఫారెస్ట్ అధికారి జయశ్రీ వేధింపుల కారణంగానే గిరిజన రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. గిరిజన రైతులను బహిరంగంగానే బెదిరించడం, “చనిపోండి” అనే స్థాయిలో మాట్లాడడం అత్యంత బాధాకరమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద కార్పొరేట్ సంస్థలకు వేల ఎకరాల భూమిని లీజుకు ఇస్తున్నప్పటికీ, జీవనోపాధి కోసం ఒకటి, రెండు ఎకరాల్లో సాగు చేస్తున్న గిరిజన రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయడం, కేసులు పెడతామని బెదిరించడం అన్యాయమని ఆయన అన్నారు. ఫారెస్ట్ అధికారుల వేధింపులు వెంటనే నిలిపివేయాలని, లేనిపక్షంలో గిరిజనులను ఏకం చేసి జిల్లా ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫారెస్ట్ అధికారి జయశ్రీని తక్షణమే సస్పెండ్ చేసి, ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు, ముదాం అరుణ్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.