Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2025, 8:14 pm Posted by : ramakrishna

జడ్జీల బదిలీలు, నియామకాలు, పదోన్నతులు

  • సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావుకు పదోన్నతి, బదిలీ

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా జ్యూడిషియరీలో పలువురు జడ్జీలను బదిలీలు, నియమాకాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న హరీషను నిజామాబాద్ మొదటి అదనపు జిల్లాజడ్జీగా నియమించారు. ఆమె స్థానంలో నల్లగొండ జిల్లా అదనపు జిల్లాజడ్జీగా ఉన్న డి.దుర్గ ప్రసాద్ బదిలీపై రానున్నారు. నిజామాబాద్ మూడవ అదనపు జిల్లాజడ్జీ ఆశాలత ను రంగారెడ్డి జిల్లా ఎల్. బి నగర్ కోర్టుకు బదిలీ చేశారు. బోధన్ ఐదవ అదనపు జిల్లాజడ్జిగా డి. వరూధిని నియమించారు. ఆమె వరంగల్ జిల్లా నర్సంపేట్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జిగా ఉన్నారు. అదనపు జిల్లాజడ్జిగా పదోన్నతిపై వస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు కు హైకోర్టు అదనపు జిల్లాజడ్జిగా పదోన్నతి కల్పించింది. ఆయనను హైదరాబాద్ ప్రత్యేక పోక్సో కోర్టు అదనపు జిల్లాజడ్జిగా నియమించారు. జడ్జిగా, జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శిగా తనదైన ముద్ర వేశారు ఉదయ్ భాస్కర్ రావు.జిల్లాలోని ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని పలు గ్రామాలలో గ్రామ అభివృద్ధి కమిటీల చట్టావ్యతిరేక కార్యక్రమాలను కట్టడి చేయడంలో తనకున్న అధికార పరిధిలో పని చేసి విడిసి ల చట్ట పరిమితులలో పని చేసే విదంగా కృషి చేశారు. విడిసి అకృత్యాలకు బాధితులైన పలువురు రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించడంతో, హైకోర్టు ఆదేశాల మేరకు విడిసిల ఆధిపత్యం ఉన్న గ్రామాలలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించి, ఒక మార్పు దిశగా న్యాయసేవ సంస్థ అడుగులు వేయగలిగింది. కొన్ని విడిసిలు రద్దు చేసుకోవడం జరిగింది.