Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 October 2024, 4:48 pm Posted by : ramakrishna

బదిలీ ప్రభావం

దినమంతా కానరాని కరెంట్

ట్విట్టర్ లో సీఎంకు ఫిర్యాదు

నిలిచిన ఉత్తర్వులు

 

నిజామాబాద్, బతుకమ్మ:  ఎటు చూసిన పండగ వాతావరణం..  వేడుకలకు కావాల్సిన వాటిని ఏర్పాటు చేసుకోవడంలో పిల్లలతోపాటు పెద్దలు నిమగ్నం.  నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న వేళ.. మరునాడు ఎప్పటిలాగే ఉత్సవాల నిర్వహణ కోసం సిద్ధమవుతుండగా తీరా ఉదయం కరెంటు కట్.. ఇగ వచ్చే.. అగ వచ్చే అని ఎదురు చూస్తుండగానే సాయంత్రం అయ్యింది. పొద్దునెప్పుడో పోయిన కరెంటు సాయంత్రం వచ్చింది. ఇది ఎక్కడో కాదండోయ్.. నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండల కేంద్రంలో ఈ నెల 7న జరిగిన ఘటన.

బదిలీ ప్రభావం

ఉద్యోగుల బదిలీల ప్రభావం విద్యుత్ సరఫరాపై పడుతోంది. బదిలీ జాబితాలో పేర్లున్న వారు తామెలాగో వెళ్లిపోతున్నామని విధులకు ఎగనామం పెడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రిలీవ్ అయ్యేంత వరకు డ్యూటీ ప్రాంతంలోనే ఉండాల్సిన వారు అటు వైపు వెళ్లకపోవడంతో విద్యుత్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆరోపణలకు ధర్పల్లి ఘటన బలాన్నిచ్చింది. బదిలీ జాబితాలో పేరున్న ధర్పల్లి ఏఈ ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జాయిన్ అయ్యేందుకు వెళ్లాడు. అయితే ఆ అధికారి జిల్లా ఉన్నతాధికారి అనుమతి లేకుండానే వెళ్లడం, కిందిస్థాయి సిబ్బందికి తెలిసినా పట్టించుకోకపోవడంతో ఈనెల 7వ తేదీన ధర్పల్లిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా మరమ్మతులు చేయలేకపోయారు. ఏఈ తనను ఖమ్మం ప్రాంతానికి బదిలీ చేయాలని కోరుతూ కంపెనీ సీఎండీని కలిసేందుకు వెళ్లారని తెలిసింది. ఫలితంలో ధర్పల్లిలో సుమారు 10గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఎవరూ పట్టించుకోలేదు. ఉన్న రెండు ట్రాన్స్ ఫార్మర్ లలో ఒకటి ముందు రోజే బ్రేక్ డౌన్ కాగా, మరోదానిపై లోడ్ అధికమై ఫెయిలయ్యింది. సాయంత్రం వేళ విషయం తెలుసుకున్న ఏడీ ధర్పల్లికి వెళ్లి మరమ్మతుల చేయించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

దినమంతా కటకట

ఇళ్లు, వ్యవసాయ అవసరాల కోసం నిరంతరాయంగా విద్యుత్ ను సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తోంది. కొద్దిసేపు కరెంటు లేకపోతేనే తట్టుకోలేని పరిస్థితులలో సుమారు 10 గంటలు విద్యుత్ లేకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించవచ్చు.  ధర్పల్లి మండల కేంద్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరెంటు జాడలేదు. ఇళ్లలో బోర్లు నడవక పోవడంతో నీటికి కటకట ఏర్పడింది. అధికారులకు విన్న వించినా విద్యుత్ సరఫరాను పునరిద్ధరించడం కోసం రాలేక పోయారు.

ట్విట్టర్ లో సీఎంకు ఫిర్యాదు

అయ్యా.. ముఖ్యమంత్రి గారు మీకు ఓటు వేసిన పాపానికి మా ఊరిలో కరెంటు లేక అవస్థలు పడుతున్నామని ధర్పల్లి గ్రామానికి చెందిన ఒకరు ఏకంగా ముఖ్యమంత్రికి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని కంపెనీ సీఎండీకి చేరవేశారు. అప్పుడు గాని అధికార యంత్రాంగం మేల్కొనలేదు. ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల, దసరా పండుగ ముందు బదిలీల వ్యవహారంతో మండల కేంద్రమైన ధర్పల్లి గ్రామం కరెంటుకు దూరమైంది. ఈ వ్యవహారం ఏకంగా శాఖలో బదిలీలను నిలిపివేసే వరకు వెళ్లినట్లు తెలిసింది.