. ఆరోగ్యం సహకరించడం లేదన్నా కనికరించని అధికారి
. మాటలతో మధ్యపెట్టిన యూనియన్ నాయకుడు
. గుండెపోటుతో ఏఎల్ ఎం శ్రీరాములు కన్నుమూత
విద్యుత్ శాఖలో ఇటీవల చేపట్టిన బదిలీ ప్రక్రియ ఓ కుటుంబాన్ని రోడ్డు పారేసింది. తల్లి క్యాన్సర్ తో పోరాడుతోందని, రోడ్డు ప్రమాదంలో తన కాలు విరిగి ఆరోగ్యం సహకరించడం లేదని.. తనకు సబ్ స్టేషన్ విధులు కేటాయించాలని ఆ ఉద్యోగి వేడుకున్నా.. అతడి జీవితంతో అధికారి ఆటలాడుకున్నారు. ఆర్మూర్ సబ్ స్టేషన్ లో ఉన్న ఆ ఉద్యోగిని బదిలీల్లో భాగంగా ఫీల్డ్ కు పంపించడంతో తీవ్రమనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందాడు.
నిజామాబాద్, బతుకమ్మ : విద్యుత్ శాఖ డివిజన్ అధికారి ఒంటెద్దు పోకడల కారణంగా నిండు ప్రాణం పోయింది. తన తల్లి క్యాన్సర్ తో పోరాడుతోందని, తనకు ఆరోగ్యం సహకరించడం లేదని సబ్ స్టేషన్ విధులు కేటాయించాలని కాళ్లావేళ్లాపడ్డా కనికరించకుండా ఫీల్డ్ కు ట్రాన్స్ ఫర్ చేయడంతో మానసిక ఒత్తిడిని భరించలేక మనస్తాపానికి గురై ఆర్మూర్ డివిజన్ లోని బట్టాపూర్ లో ఏఎల్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీరాములు సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. విద్యుత్ శాఖలో ఇటీవల బదిలీల ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. ఉద్యోగుల నుంచి ఆప్షన్ స్వీకరించిన ఉన్నతాధికారులు ఆ తరువాత బదిలీలను పూర్తి చేశారు. ఆర్మూర్ సబ్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న శ్రీరాములుకు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలువిరిగింది. దీనికి తోడు తల్లి క్యాన్సర్ తో బాధపడుతుండడంతో ఆమెతోపాటు చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే విద్యత్ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్మూర్ సబ్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న శ్రీరాములు తన పరిస్థితిని డీఈఈ దృష్టికి తీసుకెళ్లాడు. ఏదైనా సబ్ స్టేషన్ లో విధులు కేటాయించాలని ఆప్షన్ ఇచ్చి ప్రాధేయపడ్డాడు. అయినా కనికరించని ఆ అధికారి శ్రీరాములును బట్టాపూర్ గ్రామంలో ఫీల్డ్ కు కేటాయించాడు.
నమ్మితే ప్రాణమే పోయింది
బదిలీలకు ముందు సబ్ స్టేషన్ లోనే ఆపరేటర్ గా ఉండేలా చేయిస్తానని ఓ యూనియన్ నాయకుడు శ్రీరాములుకు చెప్పడంతో అతడి మాటలను గుడ్డిగా నమ్మాడు. ఎంతో సంతోషంగా కృతజ్ఞతలు కూడా తెలిపాడు. అయితే బదిలీ ఉత్తర్వుల్లో అంతా తారుమారైంది. తనను బట్టాపూర్ కు.. అదీ ఫీల్డ్ కు ట్రాన్స్ ఫర్ చేయడంతో ఆందోళనకు గురైన శ్రీరాములు సదరు యూనియన్ నాయకుడికి ఫోన్ చేశాడు. ఇప్పటికైతే నాలుగు రోజులు ఫీల్డ్ డ్యూటీ చేయు.. త్వరలోనే సబ్ స్టేషన్ ఇప్పిస్తానని చెప్పాడు. ఆ తరువాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడ్డు లిఫ్ట్ చేయకపోవడంతో శ్రీరాములు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.
నాయకుని భరోసాతో..
యూనియన్ నాయకుని మాటలను పూర్తిగా నమ్మిన బాధితుడు శ్రీరాములు ఆయన చెప్పినట్లుగానే కిందమీద పడుతూ విధులకు హాజరయ్యాడు. తన వల్ల ఫీల్డ్ వర్క్ కావట్లేదని నాయకునికి చెప్పుకుందామంటే ఫోన్ ఎత్తకపోయేసరికి సహచరులతో బాధను పంచుకున్నాడు.
హైదరాబాద్ లో గుండెపోటు..
కాన్సర్ తో బాధపడుతున్న తల్లిని చికిత్స కోసం తీసుకెళ్లిన శ్రీరాములు అక్కడే గుండెపోటుతో కన్నుమూశాడు. తన పరిస్థితి ఎవరికి చెప్పుకున్నా పట్టించుకునే వారు లేరని ప్రతి రోజూ ఇంట్లో ఆవేదన చెందేవాడని బాధిత కుటుంబ సభ్యలు రోదిస్తున్నారు. డివిజన్ అధికారి నిర్వాకం వల్లే తమ కుటుంబం రోడ్డున పడిందని, సదరు అధికారి కారణంగా ఇంకా ఎంత మంది రోడ్డుపాలవుతారోనని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .