Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 5:30 pm Posted by : ramakrishna

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై శిక్షణ

 

. . . బీ.ఎల్.ఓ ల గైర్హాజరుపై కలెక్టర్ ఆగ్రహం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై బూత్ లెవెల్ అధికారులకు బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శిక్షణ నిర్వహించారు. అయితే, శిక్షణ కార్యక్రమానికి పలువురు బీ.ఎల్.ఓలు హాజరు కాకపోవడాన్ని గమనించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన ఎంతో కీలకమైన శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణించారు. గైర్హాజర్ అయిన బీ.ఎల్.ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై తప్పనిసరిగా కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ తరహా నిర్లక్ష్యం కారణంగానే ఎస్.ఐ.ఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఎంతో వెనుకబడి ఉందని, బీ.ఎల్.ఓలు శిక్షణకు గైర్హాజరు అయితే మీరేం చేస్తున్నారంటూ సూపర్ వైజర్లపై కూడా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే మూకుమ్మడి సస్పెన్షన్లకు కూడా వెనుకాడేది లేదని బీ.ఎల్.ఓలుగా వ్యవహరిస్తున్న మెప్మా ఆర్.పీలు, అంగన్ వాడీ సిబ్బంది, వార్డు ఆఫీసర్లకు స్పష్టమైన హెచ్చరికలు చేశారు. బీ.ఎల్.ఓలు నిర్వర్తించవలసిన విధులు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ నిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలు, ఎన్యుమరేషన్ ఫారం నింపాల్సిన విధానం, క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన ధృవీకరణ పత్రాలు తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లు జ్ఞానేశ్వర్, సంతోష్ కుమార్ లు అవగాహన కల్పించారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్ల సహకారంతో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ రవీంద్ర సాగర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సౌత్, నార్త్ తహసీల్దార్లు శ్రీధర్, విజయ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.