నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో సందర్భంగా జిల్లా కేంద్రంలో ఈ నెల 17న ఉదయం 11 నుంచి రాత్రి ఒంటి గంట వరకు ట్రాఫిక్ ఉంటుందని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. దుబ్బ చౌరస్తా నుంచి రైల్వే గేట్, గంజి, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, బోధన్ బస్టాండ్, బర్కత్ పురా, గురుద్వారా నుంచి లక్ష్మీ మెడికల్ బడా బజార్ చౌరస్తా, గోల్ హనుమాన్ చౌరస్తా, పూలాంగ్ చౌరస్తా మీదుగా వినాయకుల బావి వరకు ఈ వినాయక రథయాత్ర కొనసాగుతుందని, ఇందులో భాగంగా ట్రాఫిక్ మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ వైపు నుంచి నిజామాబాద్ కు వచ్చే ఆర్టీసీ బస్సులు మాధవ నగర్, కంఠేశ్వర్ బైపాస్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ చేరుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే బోధన్ వైపు వెళ్లే ఆర్టీసీ వాహనాలు రైల్వే స్టేషన్, ఎన్టీఆర్ చౌరస్తా, బైపాస్, న్యూ కలెక్టరేట్, అర్సపల్లి రైల్వే గేట్ మీదుగా బోధన్ వైపు వెళ్లాల్సి ఉంటుందన్నారు. బాన్సువాడ వెళ్లే వాహనాలు రైల్వే స్టేషన్, ఎన్టీఆర్ చౌరస్తా, కోర్టు సర్కిల్, పూలాంగ్ చౌరస్తా, ఆర్ ఆర్ చౌరస్తా, వర్ని చౌరస్తా మీదుగా బాన్సువాడ వైపు మళ్లించనున్నట్లు వివరించారు. హైదరాబాద్ వైపు నుంచి బోధన్ వెళ్లే భారీ వాహనాలు మాధవనగర్, బైపాస్, న్యూ కలెక్టరేట్, అర్సపల్లి రైల్వే గేట్ మీదుగా బోధన్ వైపు వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రజలు గమనించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.