వెబ్ డెస్క్ ,బతుకమ్మ :
అనుమతి లేని భవన నిర్మాణం నిలుపుదల చేయకుండా ఉండడానికి లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీబీకి చిక్కారు. ఈ సంఘటన బుధవారం మొయినాబాద్ మున్సిపాలిటీలో జరిగింది. మొయినాబాద్ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్న గుండు వాణి, సీనియర్ అసిస్టెంట్ ఎలమాని సుదర్శన్ ద్వారా రూ.75 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుడు కట్టుకుంటున్న ఇంటిని కూల్చివేయకుండా ఉండాలంటే లంచం డిమాండ్ చేయడంతో అతను ఏసీబీని ఆశ్రయించారు. హైదరాబాద్ సిటీ రేంజ్ -2కు చెందిన అధికారులు వలపన్ని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తో పాటు సీనియర్ అసిస్టెంట్ ను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నగదును రికవరి చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. ఇద్దరికి న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.