Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 7:50 pm Posted by : ramakrishna

విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం టామ్‌కాం కీలక పాత్ర పోషించాలి

 

. . . తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొందాలనుకునే వారికి అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలు నిర్వహించడంతో పాటు పాస్‌పోర్టులు, విదేశీ ఉద్యోగ అవకాశాల కల్పన బాధ్యతను తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కాం) తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. విదేశాలకు వెళ్లే కార్మికులు ఏజెంట్ల చేతిలో మోసపోకుండా సమగ్ర వ్యవస్థను రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. శక్తి శాఖపై మంత్రి వివేక్ వెంకటస్వామి, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు మధ్యప్రాచ్య దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారని, సరైన మార్గదర్శకాలు లేక పలువురు ఏజెంట్ల మోసాలకు గురవుతున్నారని సీఎం పేర్కొన్నారు. విదేశీ కంపెనీలతో టామ్‌కాం నేరుగా ఒప్పందాలు చేసుకోవాలని సీఎం సూచించారు. ఆయా దేశాల్లోని మ్యాన్‌పవర్ కంపెనీలతో ఒప్పందాలు ఉంటే, విదేశాలకు వెళ్లిన కార్మికులకు ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు చర్చలు జరిపి పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. విదేశాలకు కార్మికులను పంపించే ఏజెంట్ల వివరాలను సేకరించి, వారి ద్వారా వెళ్లే ప్రతి వ్యక్తి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. టామ్‌కాం పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారిని సీఈవోగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. విదేశీ ఉద్యోగాలకు వెళ్లే వారికి లైట్ మోటార్ వెహికల్ (ఎల్ఎంవి), హెవీ మోటార్ వెహికల్ (హెచ్ఎంవి) డ్రైవింగ్‌లోనూ శిక్షణ అందించాలని సూచించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పరిశోధన, నూతన ఆవిష్కరణలకు అవసరమైన రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. జర్మన్, జపనీస్, కొరియన్, చైనీస్, రష్యన్ తదితర విదేశీ భాషలు నేర్చుకునేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించారు. విదేశీ భాషల బోధనకు స్థానిక నిపుణులతో పాటు ఆయా దేశాలకు చెందిన శిక్షకులను కూడా తీసుకురావాలని సీఎం పేర్కొన్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అందిస్తున్న ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల మాదిరిగానే బ్లూ కాలర్ ఉద్యోగాల కోసం శిక్షణ పొందే వారికి కూడా స్కాలర్‌షిప్‌లు అందించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు, ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని సీఎం తెలిపారు. చదువుతో పాటు ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా విద్యార్థులకు స్టైఫండ్ లభించడమే కాకుండా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పెంపొందుతాయని చెప్పారు. ఏటీసీల్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సర్వీసింగ్, డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలని సీఎం సూచించారు. ఈవీల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి నిర్వహణకు నిపుణుల అవసరం ఉందని, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెరుగుతున్నందున డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ అవసరమని తెలిపారు. దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ నర్సింగ్ సేవలకు భారీ డిమాండ్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇంటికో నర్సు అవసరం ఏర్పడుతోందని తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నర్సింగ్ కళాశాలలకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

 

TOMCOM should play a key role in overseas job opportunities.