- జిల్లా రాజకీయాలలో యాక్టివ్ కానున్న కవిత
- దాదాపు 10 నెలల తరువాత నిజామాబాద్ కు రాక
- భారీగా స్వాగత ఏర్పాట్లు చేసిన బీఆర్ఎస్
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం జిల్లాకు రానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలు నుంచి విడుదల తరువాత జిల్లాకు రానున్న కవితకు ఘన స్వాగత ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్. దాదాపు పది నెలల విరామం తరువాత వస్తున్న కవితకు స్వాగతం పలికేందుకు జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, భారత జాగృతి నాయకులు భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ధ స్వాగతం చెప్పనున్నారు. తరువాత నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ వద్ద స్వాగతం పలికి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సుభాష్ నగర్ లోని ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వద్ధ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ తొలిసారి బీఆర్ఎస్, జాగ్రుతి నాయకులను ఉద్దేశించి మాట్లాడుతారు. ఆదివారం రాత్రి కొండూర్ లో దేవాలయం దర్శనం నిజామాబాద్ లో బస చేసి సోమవారం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు.
గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత, మార్చి 15న కవితను ఈడి అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. ఆగస్టు 23న జైలు నుంచి విడుదలైన కవిత అనారోగ్యం కారణంగా హైద్రాబాద్ కు పరిమితమయ్యారు. బతుకమ్మ, దసరా ఉత్సవాలలో పాల్గొనడానికి నిజామాబాద్ వస్తారని ప్రచారం జరిగిన అది కార్యరూపం దాల్చలేదు. ఇటీవల అదానిపై అమెరికాలో కేసుల నమోదైన నాడు ఎక్స్ వేదికగా స్పందించిన కవిత మళ్లీ రాజకీయాలలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. బిసి కుల గణనపై డెడికేట్ కమిటీకి భారత జాగృతి ఆధ్వర్యంలో నివేదిక ఇచ్చిన తరువాత జగిత్యాల జిల్లాలో పర్యటించారు. తరువాత క్రమంలో బీఆర్ఎస్ నాయకులపై వివిధ పోలీస్ స్టేషన్ లలో నమోదైన కేసులతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నేపథ్యంలో యాక్టివ్ రోల్ పెంచారు. తనకు ఉద్యమ పరంగా, రాజకీయంగా జన్మనిచ్చిన ఇందూర్ జిల్లా నుంచి మళ్లీ ప్రత్యక్ష రాజకీయ ఉద్యమాలకు శ్రీకారం చుడుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నిజామాబాద్ పార్లమెంట్ వేదికగా రాజకీయాలను శాసించిన కల్వకుంట్ల కవిత మళ్లీ ఇక్కడినుంచి యాక్టివ్ కావడానికి ప్రధానంగా తనను జైలు పాలు చేసిన బీజేపీని టార్గేట్ చేయడం లక్ష్యం అని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. అసెంబ్లీ ఎన్నికలలో అరవింద్ ను ఓడించిన పార్లమెంట్ కు వచ్చే సరికి పార్టీ మూడో స్థానంకు పరిమితం కావడం ఒకకారణం అని చెబుతున్నారు. అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారడం తో మళ్లీ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పట్టు కోసం కవిత ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా తనకు రాజకీయంగా కలిసి వచ్చిన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఎన్నికలకు సిద్ధం చేయడం లక్ష్యంగా పావులు కదుపనున్నారట. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఒక్కరే శాసన సభ్యులుగా ఉన్న రాజకీయంగా తన నియోజకవర్గానికి పరిమితం కావడంతో కవిత ఇందూర్ జిల్లా పార్టీ శ్రేణులను ఒకతాటిపైకి తీసుకువచ్చేందుకు అందరిని కూడగడుతున్నారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.