Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 8:37 pm Posted by : ramakrishna

రేకుల షెడ్ ధ్వంసం

 

. . . దాడి చేశారంటూ ఫిర్యాదు

 

బోధన్, బతుకమ్మ :

 

తన స్థలంలో నిర్మించుకున్న రేకుల షెడ్‌ను ధ్వంసం చేసి, తనపై, కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సాలుర గ్రామానికి చెందిన ఆలేవర్ ఆనంద్ బోధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బోధన్ ఎస్‌హెచ్‌ఓకు రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. సాలుర శివారులోని సర్వే నంబర్ 1962లో 242 చదరపు గజాల స్థలాన్ని రిజిస్టర్ సేల్ డీడ్ నంబర్ 2252/2023 ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ అనుమతులతో అక్కడ రేకుల షెడ్ నిర్మాణంతో పాటు ఫ్లోరింగ్ టైల్స్ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 8న సాలుర గ్రామ సర్పంచ్ భర్త సోలం రవి, ఉప సర్పంచ్ సురేష్ పటేల్, డిస్కో సాయిలు, వార్డు సభ్యులు జాఫర్, కల్లూరి బాసిర్, గైని అరవింద్, బగం శ్రీకాంత్ తదితరులు గుంపుగా వచ్చి తన స్థలంలోకి ప్రవేశించారని ఆనంద్ ఆరోపించారు. అక్కడ ఉన్న రేకులు, ఫ్లోరింగ్ టైల్స్‌ను ధ్వంసం చేసినట్లు తెలిపారు. అనంతరం తనను, కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా డిస్కో సాయిలు తనను రూ.లక్ష డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వకపోవడంతోనే దాడికి పాల్పడ్డారని ఆనంద్ ఆరోపించారు. ఈ ఘటనలో సుమారు రూ.50 వేల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. స్థల వివాదానికి సంబంధించి గతంలోనే గ్రామ పంచాయతీకి లీగల్ నోటీసు ఇచ్చినట్లు ఆనంద్ పేర్కొన్నారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఘటనకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బోధన్ పోలీసులను కోరారు. తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. ఈ ఆరోపణలపై పోలీసుల స్పందన, దర్యాప్తు వివరాలు తెలియాల్సి ఉంది.

 

Tin shed destroyed