. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు నిజామాబాద్ నగరంలో మొత్తం 2 ఎగ్జామినేషన్ సెంటర్ లలో పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు ఈ నెల 25 నుంచి 31 వరకు జరగనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు జరిగే వారం రోజులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని వెల్లడించారు. దీని ప్రకారం పరీక్ష కేంద్రం చుట్టు 100మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులుగా చేరడం నిషేదమన్నారు. పరీక్షల సమయంలో పరీక్ష కేంద్రం సమీపంలోని ఇంటర్ నెట్, స్టేషనరీ, జిరాక్స్ షాపులను తప్పని సరిగా మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేయబడుతుందని, కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని సీపీ తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షలు రాసే విద్యార్థులందరూ ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ సీపీ విద్యార్థులకు “ఆల్ ది బెస్ట్” తెలిపారు.