. . . ప్రచారం ప్రారంభించిన కొందరు అభ్యర్థులు
. . . టికెట్ల కేటాయింపుపై స్పష్టత కరువు
. . . టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అయోమయం
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి షురూ అయింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థులుగా కొందరు ప్రచారం ప్రారంభించడమే ప్రధాన కారణం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నిజామాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెల్సిందే. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా బల్ధియా ఎన్నికలకు ఇంచార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల అర్బన్ లో కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్ధేశం చేశారు. అయితే ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల గురించి పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకున్నా కొందరు అభ్యర్థులుగా ప్రకటించుకుని ప్రచారం చేస్తుండడం లొల్లికి కారణమైంది. తాము పార్టీ నుంచి కష్టపడి పని చేస్తే ఇటీవల పార్టీలో చేరిన వారిని ఎలా అభ్యర్థులుగా ప్రకటిస్తారని సీనియర్ నాయకులు మండిపడుతున్నారు. పార్టీ ఎక్కడా కూడా అభ్యర్థుల ప్రకటన చేయకముందే ప్రచారం చేయడం ఏమిటని దాంతో డివిజన్ లలో ఓట్లు చీలిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ లో టికెట్ల లొల్లికి లీడర్లే కారణమని చెబుతున్నారు. నిజామాబాద్ బల్ధియా ఎన్నికల్లో సీనియర్ల పెత్తనమే వారే కొందరికీ టికెట్ల గురించి అభయహస్తం ఇచ్చి ఉంటారన్న టాక్ నడుస్తోంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఇంచార్జిగా మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ వ్యవహరిస్తున్నారు. పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచే తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులుగా ఉన్న సుదర్శన్ రెడ్డి సైతం మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు వ్యవహరంలో తన అనుచరులకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. 60 డివిజన్ల ఉన్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 10 డివిజన్లలో ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల ఓట్లు ఉన్నాయి. 10 డివిజన్లలో స్థానిక ఎమ్మెల్యేల అనుచరులకు టికెట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ వారందరినీ పరిగణలోకి తీసుకోకముందే ఇద్దరు లీడర్లు 50 డివిజన్ లలో టికెట్ల ఖరారును చేపట్టినట్లు ప్రచారం జరుగుతుంది. రూరల్, ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని టికెట్ల వ్యవహరంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు పార్టీ నియోకవర్గ ఇంచార్జి అభిప్రాయాలను తీసుకుంటారా లేదా అనే చర్చ మొదలయింది.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికార పార్టీ మేయర్ స్థానాన్ని గెలుచుకోవడం దశాబ్ధ కాలంగా వస్తోంది. గత రెండు పర్యాయాలు బల్ధియా ఎన్నికల్లో ఆనాటి అధికార బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను గెలువకున్న మిత్రపక్షమైన మజ్లీస్ తో జతకలిసి మేయర్ పీఠాన్నిఎగురవేసుకపోయింది. దానితో బల్ధియాలో బీజేపీ ఎక్కువ మంది కార్పొరేటర్లను గెలుస్తున్నప్పటికీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోలేక వెనుకబడింది. ఈసారి మేయర్ స్థానం కోసం అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీలు పోటీ పడుతున్నాయి. అందుకు రెండు పార్టీలు మెజార్టీ స్థానాల గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ కు పతంగి పార్టీ మద్దతు ఉంటుందని ఈసారి కూడా మేయర్ స్థానం తమ ఖాతాలోనేనని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయితే టికెట్ల కేటాయింపు ప్రారంభంలోనే కాంగ్రెస్ పార్టీలో బేధాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ విషయంపై నిజామాబాద్ అర్బన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణను వివరణ కోరగా ఇప్పటి వరకు ఎవరికి కూడా టికెట్ల కేటాయింపు జరుగలేదని, ఎవరైనా నేతలు వారికి అభయహస్తం ఇచ్చి ఉండవచ్చని తెలిపారు. ప్రచారం చేసుకోవడం వరకు సరేనని, బీఫారాలు ఇచ్చినప్పుడు వారికి కేటాయిస్తే పోటీలో ఉంటారని లేకపోతే మద్దతుదారుడిగా ఉంటారని చెప్పారు.
