నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ఒకరి మృతికి కారణమైన ఇద్ధరికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నిజామాబాద్ నగరంలోని ఇందిరపూర్ కాలోనికి చెందిన కలకొండ శ్రీకాంత్ బోధన్ రోడ్ లోని మహేక్ హోటల్ దగ్గర తన బైక్ ను పార్క్ చేసి టీ తాగడానికి వెళ్ళాడు. టీ త్రాగి వచ్చే సమయంలోనే అతని బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. సీసీటీవీ పూటేజీ ఇద్దరు వ్యక్తులు బైక్ ను దొంగలించినట్లు కనబడింది.వారి ఆచూకీ తెలుసుకొనగా మాక్లూర్ మండలం వడ్యాట్ పల్లి కి చెందిన అసీప్, బాబులుగా గుర్తించి వారి సెల్ ఫోన్ ను సంపాదించి తన బైక్ ను తనకు ఇవ్వాలని సంప్రదింపులు జరిపాడు. బైక్ ను ఇచ్చివేస్తామని బర్ధిపూర్ రోడ్డుకు రావాలని కోరడంతో శ్రీకాంత్ తన తండ్రి తో కలిసి వారు పిలిచిన ఓక ప్రైవేట్ కార్యాలయం దగ్గరకు 13 అక్టోబర్ 2020 న వెళ్లాడు. అక్కడకు వెళ్లిన శ్రీకాంత్ అతని తండ్రి కలకొండ శాంతయ్య తమ బైక్ ను దోంగిలించి, తమకు తీవ్ర అవేధనకు కారణమైన అసిఫ్, బాబు లపై చేయిచేసుకున్నారు. కాని వారిద్ధరు ఎదురు దాడిచేయడంతో వీరి దెబ్బలకు కింద పడిన శాంతయ్య గాయాల పాలయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేయగా అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు కావడంతో అసిఫ్, బాబు లకు భారత శిక్షాస్కృతి సెక్షన్304 పార్ట్ 2 ప్రకారం ఇద్దరికి మూడేళ్ళ చొప్పున కఠిన కారాగార శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధిస్తు జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయముర్తి సునిత కుంచాల తీర్పు చెప్పారు.