Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 May 2025, 10:48 pm Posted by : ramakrishna

ఎదురు కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి

  • ఆర్ఎస్ఐకి తీవ్రగాయాలు

 

హైదరాబాద్, బతుకమ్మ : మావోయిస్టు పార్టీ, గ్రేహౌండ్స్ బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు కానిస్టేబుళ్లు మృతిచెందగా, ఒక ఆర్ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం.. వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో మందుపాతరలను గుర్తించేందుకు బుధవారం రాత్రి నుంచి పోలీసు పార్టీలు గాలింపు చర్యలు చేపట్టాయి. ములుగు జిల్లా సరిహద్దు అడవుల్లో మందుపాతరలు అమర్చామని, అటువైపు ఆదివాసీలు ఎవరూ రాకూదని ఇటీవల మావోయిస్టు పార్టీ పేరిట ఓ లేఖ విడుదలైంది. దీంతో ఆ ప్రాంతంలో మందుపాతరలను గుర్తించి నిర్విర్యం చేయాలన్న యోచనలో వాజేడు పోలీస్ స్టేషన్ నుంచి బుధవారం రాత్రి పోలీసులు కూబింగ్ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున వాజేడు మండల కేంద్రానికి 17కిలో మీటర్ల దూరంలో ఉన్న పెద్ద గుట్ట సమీపంలోని నూగురు అటవీ ప్రాంతంలో పోలీసులు మందు పాతరలను గుర్తించే పనిలో నిమగ్నం అయ్యారు. అదే ప్రాంతంలో అంబూష్ తీసుకుని ఉన్న మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరపడంతో పాటు మందు పాతరలు కూడా పేల్చారు. దాదాపు 15నిమిషాల పాటు నిర్విరామంగా మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు ఘటన స్థలం నుంచి వెళ్లిపోయారు. మావోయిస్టులు దాదాపు 35 నుంచి 40మంది వరకు ఉంటారని భావిస్తున్నారు. ఈ ఎదరు కాల్పుల్లో వడ్ల శ్రీధర్, ఎన్.పవన్ కళ్యాణ్, టి.సందీప్ లు మృతి చెందారు. ఆర్ఎస్ఐ రణధీర్ కు తీవ్రంగా గాయాలు కాగా అతన్ని హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. మరణించిన పోలీసుల మృతదేహాలను వరంగంల్ ఏంజీఎం ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ కు తరలించగా రాష్ట్ర మంత్రి సీతక్క, డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్రలు నివాళులు అర్పించారు.

Three policemen killed in exchange of fire