Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 January 2025, 5:29 pm Posted by : ramakrishna

ముగ్గురు బైక్ దొంగల అరెస్ట్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని మూడో పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ వెంకట రాజా రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని గుండారం గ్రామంలో గల శాస్త్రి నగర్ కు చెందిన తాడెం అనిల్ కుమార్, మరో ఇద్దరికి అరెస్ట్ చేసి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జూన్ 24, 2024న ఉదయం ఫిర్యాదు దారుడు నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్ ముందర తన ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ చేసి వాకింగ్ కు వెళ్లాడని తెలిపారు. తిరిగి వచ్చి చూసే సరికి తన వాహనం కనిపించలేదన్నారు. చుట్టు పక్కల వెతికినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. దీంతో ఈ నెల 15న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడని తెలిపారు. ద్విచక్ర వాహనాల దొంగతనాలు ఎక్కువ అవుతుండటంతో మూడో టౌన్ పోలీసులు కంఠేశ్వర్ లో వాహనాల తనిఖీలు నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా ఒకరు పోలీసులను చూసి తన మోటార్ సైకిల్ పై పారిపోవడానికి ప్రయత్నించాడని తెలిపారు. వెంటనే ఎస్ఐ, సిబ్బంది అతడిని పట్టకుని విచారించగా తాను జల్సాలకు అలవాటు పడి మోటార్ సైకిల్ ను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. దీంతో అతడిని అరెస్ట్ చేసి నాలుగు మైటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.