. . . డీజీపీని కోరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ :
నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో కుల వివక్షతో దాడి చేసి రెండు నెలల పసి బిడ్డ మరణానికి కారకులైన వారిని శిక్షించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ విషయమై డీఎస్పీ అధ్యక్షులు విశారదన్ మహరాజ్ తో కలిసి డీజీపీని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ నాగర్ కర్నూల్ లోని కుమ్మెర గ్రామంలో జరిగిన అమానవీయ సంఘటనను ఖండిస్తున్నామన్నారు. రెండు నెలల చిన్నారి మరణానికి న్యాయం జరిగేలా సంఘటనకు కారణమైన వారికి శిక్షపడేలా బాధిత కుటుంబం పోరాటం చేస్తోందన్నారు. వారికి విశారదన్ అండగా ఉన్నారని, జాగృతి తరఫున మేము కూడా బాధితులకు మద్దతుగా నిలబడతామన్నారు. పాప మరణానికి సంబంధించి పోలీసులు ఒక్క సెక్షన్ కూడా పెట్టలేదని, ఈ సంఘటనలో అనేక కోణాలు ఉన్నాయని, ఆయా సెక్షన్లు కూడా పెట్టలేదన్నారు. పోలీసులు, ప్రభుత్వం కలిసి నేరం చేసిన వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. పాప తల్లి మౌనికకు, వారి కుటుంబానికి మా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నామన్నారు. 2026లో కుల వివక్షతో ఇంతటి దాష్టీకం జరగటం చూస్తుంటే ప్రజా పోరాటాలతో సంబంధం ఉన్న వ్యక్తిగా చాలా సిగ్గు పడుతున్నామన్నారు. కుల వివక్ష ఉండకుండా పరిస్థితి మారేందుకు ఈ కేసులో కఠిన మైన చర్యలు తీసుకోవాలని, అప్పుడే కులవివక్ష లేకుండా చేయటానికి మొదటి అడుగు వేసినట్లు అవుతుందన్నారు. ఈ కేసులో నిందితులను శిక్షించే వరకు పోరాటం ఆపేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు.
