నిజామాబాద్, బతుకమ్మ : మెడికల్ విద్యార్థిపై ర్యాగింగ్ ఘటనను ఖండిస్తూ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నగర కార్యదర్శి ఎం.సుధాకర్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న రాహుల్ అనే మెడికోపై పీజీ మెడిసిన్ చేస్తున్న సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసి, భౌతిక దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. బాధితుడిని మభ్యపెట్టి విషయాన్ని సర్దుమనిగేలా చేసే ప్రయత్నాలు మానుకొని, ర్యాగింగ్, దాడి చేసిన సీనియర్లపై కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం శిక్షించాలని వైద్య, పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు. గౌరవప్రదమైన వైద్య వృత్తిలో సీనియర్ రెసిడెంట్లుగా ఉండి ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని తెలిపారు. ప్రభుత్వ మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల్లో ర్యాగింగ్ ఇంకా కొనసాగుతుందని ఆరోపించారు. అన్ని ప్రైవేటు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలను పునరుద్ధరించాలని, ర్యాగింగుకు పాల్పడ్డ వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను డిమాండ్ చేశారు.