నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
చోరీ బైక్, బంగారు గొలుసుతో పట్టుబడిన ఓ నిందితుడు సీసీఎస్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకోవడం నిజామాబాద్ పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని అప్పగించిన వ్యక్తి కొద్దిసేపటికే పోలీసుల కళ్లుగప్పి పరారవడం భద్రతా ఏర్పాట్లపై పలు అనుమానాలకు తావిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శనివారం సాయంత్రం ట్రాఫిక్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో నిఖిల్ సాయి చౌరస్తా వద్ద వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నంబర్ ప్లేట్ లేకుండా అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై కనిపించారు. పోలీసులను గమనించిన ఇద్దరూ బైక్‌ను అక్కడే వదిలి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన ట్రాఫిక్ సిబ్బంది వారిని వెంబడించగా, ఒక వ్యక్తిని పట్టుకున్నారు. మరో వ్యక్తి చీకటిని ఆసరాగా చేసుకుని తప్పించుకున్నాడు. పట్టుబడిన వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద బంగారు గొలుసు లభించింది. అంతేకాకుండా వారు వదిలి వెళ్లిన మోటార్ సైకిల్ కూడా చోరీకి గురైనదిగా పోలీసులు గుర్తించారు. దీంతో నిందితుడిని, స్వాధీనం చేసుకున్న బైక్, బంగారు గొలుసును తదుపరి విచారణ నిమిత్తం సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. అయితే సీసీఎస్ అదుపులో ఉన్న సమయంలోనే నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకోవడం కలకలం సృష్టించింది. కస్టడీలో ఉన్న వ్యక్తి ఎలా పరారయ్యాడనే అంశంపై ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. పరారైన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీస్ శాఖలో అంతర్గతంగా సమీక్ష జరుగుతున్నట్లు సమాచారం.