Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 December 2024, 11:10 pm Posted by : ramakrishna

పాలు అమ్మరు.. బిల్లు ఇవ్వరు

  • రెండు నెలలుగా బకాయిలు
  • కొన్న పాలను పొడి చేసి నిల్వ
  • విజయకు ధూరమవుతున్న రైతులు
  • సీఎం జిల్లాకు వస్తే బిల్లులు

హైదరాబాద్, బతుకమ్మ: కడుపులో సల్ల కదలకుండా విధులు నిర్వహించడంలో సిద్ధహస్తులుగా మారారు విజయ డెయిరీ అధికారులు. నెల కాగానే జీతం వస్తుంది, అంతకుమించి ముందుకు వెల్లకూడదనే మీమాంశలో ఉన్నట్లున్నారు కాబోళు. ఫలితంగా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది. పాల కేంద్రాల నుంచి ప్రధాన కార్యాలయం వరకు ఉన్న సిబ్బంది తమకెందుకని అనుకోవడం వల్లే విజయపై రైతుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. అదేంటో.. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తున్నారంటే ఆ జిల్లాలోని రైతులకు పాల బిల్లులు చెల్లించేస్తున్నారు.

పాలు అమ్మరు – బిల్లులెలా

గ్రామాలలో నుంచి సేకరించిన పాలు కేంద్రాని(మిల్క్ షెడ్)కి వస్తుంటాయి. సేకరించిన పాలను పాకెట్ల రూపంలోకి మార్చి స్థానికంగా ఉన్న మార్కెట్లో అందుబాటులో ఉంచితే ప్రజలు వాటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీనివల్ల వచ్చిన ఆదాయంతో రైతుకు ఇచ్చే బిల్లులను చెల్లించేందుకు ఆస్కారం ఉంటుంది. ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలవల్ల జిల్లాలలో సేకరించిన పాలు పట్నం కు పంపిస్తున్నారు. నిత్యం వేల లీటర్ల పాలు ప్రధాన కేంద్రానికి చేరుకున్నా, అవి నిరుపయోగం అవుతున్నాయని అందులోని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నప్పటికీ రైతుల నుంచి కొన్న పాలను తిరిగి సొమ్ము చేయలేకపోతున్నారు.

పేరుకుపోతున్న బకాయిలు

పశువులకు మందులతో పాటు దాణ అవసరం అవుతుంది. మార్కెట్లో దాణ ధరలు బాగా పెరిగాయి. వీటిని కొనుగోలు చేయడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రాలలో పాలు పోయగా వచ్చే డబ్బులతో కాస్త ఉపశమనం అవుతుందని రైతు భావిస్తుంటాడు. వీరికి ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ప్రతిసారి నెలల తరబడి చెల్లింపులు చేయకపోవడంతో ప్రైవేట్ కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు.

రెండు నెలల బిల్లులు…

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా విజయ కేంద్రాలలో పాలు పోసే రైతులకు రెండు నెలల నుంచి బిల్లులు అంధడం లేదు. బకాయిలు పేరుకుపోతున్నా, వీటి చెల్లింపులు జరిగే విధంగా అధికారులు కృషి చేయకపోవడంతో రైతులలో అసహనం పెరిగిపోతుంది. ఒక నెల జీతం ఆపితేనే లబోదిబోమని ఉద్యోగులు కొట్టుకుంటారు. 15 రోజులకు ఒకసారి బిల్లులు ఇవ్వకుంటే కుటుంబం ఎలా గడుస్తుందనే ప్రశ్నలు రైతుల నుంచి వస్తున్నాయి.

కొన్న పాలు పొడి రూపంలో…..

రైతుల నుంచి కొన్న పాలను సమీప ప్రాంతంలో ఉన్న కేంద్రాలలో ప్రాసెస్ చేసాకా ప్యాకెట్లను తయారు చేసి విక్రయించాల్సి ఉంటుంది. బద్దకించిన సిబ్బంది కొన్న వాటి నుంచి కొన్నింటినే పాకెట్లు చేసి మిగతా పెద్ద మొత్తంలో పాలను ప్రధాన కేంద్రానికి పంపిస్తున్నారు. ప్రభుత్వ సంస్థల్లో వేయాల్సి ఉంటుంది గనుక తప్పనిసరై పాకెట్లను తయారు చేస్తున్నారు. లేదంటే ఆ పాలను సైతం హైదరాబాద్ కు పంపించేవారని తెలుస్తోంది. ప్రధాన కేంద్రానికి చేరుకున్న పాలను ప్రాసెస్ చేసిన తర్వాత క్రీం వేరు చేసి పొడి చేస్తున్నారు. వీటినైనా మార్కెట్లో విక్రయిస్తున్నారా అంటే అధీ లేదు. గోదాముల్లో నిల్వ ఉంచడం వల్ల రైతుకు ఒనగూరేదేమి లేకపోగా సంస్థను నష్టాలలోకి అధికారులు తీసుకు వెళ్తున్నారు.

రూ. 50 కోట్లపైనే ఆశలు

పేరుకుపోయిన పాల బిల్లులు రైతులకు చెల్లించేందుకు ముఖ్యమంత్రి రూ.50 కోట్లను మంజూరు చేసారు. ఇవి వస్తేగాని చెల్లింపులు జరిగేలా లేవు. ఈ నిధులకు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ చెంత ఉండగా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. నిత్యం వేల లీటర్ల పాలు రైతుల నుంచి కొనుగోలు చేసిన పిదప వీరికి చెల్లింపునకు మార్గమేంటనే ఆలోచనలను చేయలేకపోతున్నారు. ప్రభుత్వం ఇస్తేనే రైతులకు బిల్లులు చెల్లిస్తామని చూస్తున్నారేగాని, సంస్థను లాభాల్లో నడిపించి మార్గదర్శకంగా నిలుస్తామనే ఉద్దేశం మాత్రం డెయిరీ ఉద్యోగులలో కనిపించడంలేదని ప్రజలకు అర్థమవుతోంది.