- సుపారి మర్డర్ల కోసమే తుపాకులా?
- నిజామాబాద్ లో కంట్రిమెడ్ పిస్టల్ లభ్యం
- ఇల్లీగల్ దందాల లీడర్ల వద్ద నాటుతుపాకులు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరం మరోసారి ఉలిక్కిపడింది. ఏడాదిలో రెండు నాటుతుపాకులు దొరకడం కలకలం రేపుతుంది. నాందేడ్ కు చెందిన శ్రీహరి దేవిదాస్ శర్మ ఆలియాస్ హర్యా ఆలియాస్ హరీష్ వద్ద స్థానిక 1వ టౌన్ పోలీసులు ఈ నెల 19న రాత్రి అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద కంట్రిమెడ్ పిస్టల్ తో పాటు ఒక తూటను స్వాధీనం చేసుకున్నారు. హర్యాను విచారించగా మహారాష్ట్ర నుంచి వచ్చి స్థానికులతో కలిసి బైక్ పై చైన్ స్నాచ్ చేయడం మహారాష్ట్ర పారిపోతాడని గుర్తించారు. ఇతను సహచరుడు బర్సాత్ ఆమెర్ తో కలిసి చోరిలకు పాల్పడినట్లు గుర్తించారు. అయితే వారి వద్ద దేశీవాలి తుపాకి లభించడం కలకలం రేపింది. నాందేడ్ కు చెందిన రవిలాల్ వద్ద తుపాకి కొన్నట్లు విచారణలో తేలింది. అయితే దొంగతనం ప్రవత్తిగా ఉన్న కొందరిపై నిజామాబాద్ లో రౌడిషీట్ లు ఉండడం విశేషం.

నిజామాబాద్ నగరంకు చెందిన బర్సాత్ ఆమెర్ పై రౌడిషీట్ ఉంది. కొన్ని రోజుల క్రితం నగరంలోని బైపాస్ రోడ్డులో కారులో తల్వార్ లతో వెళ్తుండగా ట్రాఫిక్ కానిస్టేబుల్ పరిశీలించగా కారు వదిలి ( అందులో హర్యా కూడా ఉన్నాడన్న ఆరోపణలున్నాయి) పరారీ అయ్యారు. ఆరు నెలల క్రితం నగరంలోని 3వ టౌన్ పరిధిలో ఒక సెటిల్ మెంట్ విషయంలో బర్సాత్ ఆమెర్ తల్వార్ తో దాడి చేయడంతో కత్తిపోట్లకు గురయ్యారు. ఈ కేసులో బర్సాత్ ఆమెర్ పరారీలో ఉండగా పోలీసులు అతనిపై పీడీ యాక్టు నమోదు చేశారు. బర్సాత్ ఆమెర్ పై ఉచ్చు బిగించేలా అతని ప్రత్యర్థులు పోలీసులకు అడిగినంత ఇచ్చేందుకు పైరవీలు చేయడం విశేషం. ఈ నెల మూడవ వారంలో బర్సాత్ ఆమెర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బర్సాత్ ఆమెర్ కు సహచరుడు అయిన నాందేడ్ కు చెందిన శ్రీహరి ఆలియాస్ హర్యా వద్ద ఇప్పుడు తుపాకి దొరకడం కలకలం రేపింది. బర్సాత్ ఆమెర్ పలు చోరి కేసులు నమోదయ్యాయి. అతడు ఆరీఫ్ డాన్ తో కలిసి 2022 డిసెంబర్ 31న మరో రౌడిషీటర్ జంగల్ ఇబ్రహీంను ఆలియాస్ ఇబ్రహీం చావూస్ ను నెహ్రూనగర్ వద్ద హత్య చేశారు. అది జరిగిన ఆరు నెలలకు ఆరీఫ్ డాన్ ను అతని సహచరులే ఎడపల్లి వద్ద నడిరోడ్డుపై లారీతో ఢీకొట్టి మట్టుబెట్టారు. ఆరు నెలల కాలంలో హతులైన ఆరీఫ్ డాన్ తో పాటు జంగల్ ఇబ్రహీంపై కూడా చోరి కేసులున్నాయి. వారి హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిపై చోరి కేసులు ఉన్నాయి. అయితే కొందరిపై చోరి కేసులతో పాటు పీడీఎస్ బియ్యం రవాణా కేసులు ఉన్నాయి. అయినప్పటికీ వారిపై నిఘా లేకపోవడంతో కేవలం రౌడిషీటర్లు గానే పరిగణలోకి తీసుకుంటుండడంతో చాలా మట్టుకు చైన్ స్నాచింగ్ కేసులు కొలిక్కిరావడం లేదు. పొరుగున ఉన్న మహారాష్ట్ర లేదా భైంసా అడ్డాగా చేసుకుని నిజామాబాద్ లో చైన్ స్నాచింగ్ చేయడం అక్కడికి పరారీ కావడం షెల్టర్ తీసుకుని రావడం నిత్యతంతుగా మారింది. బోధన్ లో ఐదు ఆరు సంవత్సరాల క్రితం బంగారు నగల వ్యాపారిని దోచుకున్న మూఠ అక్కడి నుంచి తమ కార్యకలాపాలను నిజామాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించిందనే విషయం నిఘా వర్గాలు గుర్తించలేకపోతున్నాయి. బైక్ దొంగలపై సస్పెక్ట్ షీట్ ఉండగా వారు అధికార పార్టీ పేరు చెప్పి దర్జాగా తిరుగుతున్నారు. నిజామాబాద్ లో బైక్ దొంగతనాలు అనేవి రోజు ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తునే ఉన్న రీకవరి మాత్రం అంతగా ఆశజనకంగా లేదు. ఇటీవల కాలంలో రౌడీషీటర్లు, సస్పెక్ట్ లు, లీడర్లు రేషన్ బియ్యం దందా చేయడం రివాజుగా చేసుకున్నారు. వారి వద్ద కూడా తుపాకులు లభించడం కలకలం రేపుతుంది. గతంలో రేషన్ దందా లీడర్ పై సిరికొండలో జరిగిన హత్యాయత్నంలో కాలపత్తర్ కు చెందిన రౌడీషిటర్ ఆసద్ అనుయాయుల వద్ద హైదరాబాద్ పోలీసులు నాటుతుపాకిని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలపత్తార్ ఆసద్ కూడా నిజామాబాద్ లోనే హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు.

ఆరీఫ్ డాన్ హత్య కేసులో ఏ1గా ఉన్న సమద్ వద్ద ఫ్యామిలీతో సహా షెల్టర్ తీసుకున్నఅసద్ ను గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు తీసుకున్నారు. ఈయేడాది ఫిబ్రవరి మాసంలో నగరంలోని నిజాంకాలనీలో హంజాలబేగ్, అత్తు అనే వ్యక్తుల రేషన్ బియ్యం గోదాముపై పోలీసులు దాడి చేసి షాక్ కు గురయ్యారు. అక్కడ బియ్యంతో పాటు తుపాకి, కత్తులు లభ్యమవ్వడం కలకలం రేపుతుంది. నిజామాబాద్ లో రౌడిషీటర్లుగా, పీడీఎస్ మాఫియా లీడర్లుగా చెలామణి అవుతున్న వారు ఎందుకు తుపాకులను సేకరిస్తున్నారు. ఇప్పటికే కీలక పీడీఎస్ మాఫియా లీడర్ల వద్ద తుపాకులు ఉన్నాయని వారే రేషన్ బియ్యం లోడ్ వాహనాలను ముందుగా కారులో రెక్కి నిర్వహిస్తూ సరిహద్దులను దాటిస్తారనే బియ్యం దందా చేసే వారంతా చెబుతున్నారు. ఇప్పటికే ఆరీఫ్ డాన్ హత్య కేసులో ఉన్న వారిని చంపుతానని సోషల్ మీడియా వేదికగా బర్సాత్ ఆమెర్ బెదిరించిన దాఖలాలు ఉన్నాయి. ప్రత్యర్థి గ్యాంగ్ సైతం ఆరీఫ్ డాన్ ముఖ్య అనుచరులకు స్కేచ్ వేసి సుపారి ఇచ్చామని బెదిరింపులకు దిగిన ఇప్పటి వరకు పోలీసు శాఖ గుర్తించకపోవడం విశేషం. పేరుకు రౌడీషీటర్లుగా సస్పెక్ట్ లుగా చెలామణి అవుతున్న వారు అంతర్గతంగా దొంగతనాలను చేస్తూ పైకి సంఘంలో మాత్రం పీడీఎస్ దందా చేస్తున్నామని పోలీసులను సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు. ఏడాది కాలంలో నిజామాబాద్ నగరంలో రెండు నాటుతుపాకులు దొరకడం మాత్రం పోలీసు శాఖకు సవాలేనని చెప్పాలి. అప్పటి వరకు కేసులను ఏ రోజుకు ఆ రోజు క్లోజ్ చేయడం అటుంచి లోతుగా దర్యాప్తు చేస్తే మాత్రం రౌడిషీటర్ల సస్పెక్ట్ ల వద్ద ఉన్న తుపాకుల విషయాన్ని కూపీ లాగవచ్చు.