. . . డీసీసీ నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ
. . . జిల్లాలో కాంగ్రెస్ ‘ఛాత్రోన్ కీ గూంజ్’
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పేపర్ లీకేజీల వంటి ఘటనలతో విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని డీసీసీ నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆరోపించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “ఛాత్రోన్ కీ గూంజ్” కార్యక్రమం నిజామాబాద్‌లోని కాకతీయ కళాశాలలో ఆదివారం డిసిసి నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హుందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నూడా చైర్మన్ కేశ వేణు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల దేశంలోని విద్యార్థులు, యువత భవిష్యత్ ఆందోళనకర పరిస్థితుల్లోకి నెట్టబడిందని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను దేశవ్యాప్తంగా ప్రస్తావిస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ యువతతో కలిసి పోరాటాన్ని ప్రారంభించారని తెలిపారు. విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సూచనలు, అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ వారిని కలుస్తున్నారని చెప్పారు. “కాంగ్రెస్‌తో చేయి కలిపి మీ గొంతు వినిపించండి. మీ కలలు దేశ భవిష్యత్తుకు ఎంతో అవసరం. మీ పోరాటమే దేశంలో విద్యా సంస్కరణలకు నాంది అవుతుందని ఆయన పేర్కొన్నారు. ‘ఛాత్రోన్ కీ గూంజ్’ రాజకీయ కార్యక్రమం కాదని, దేశ యువత భవిష్యత్తు కోసం ప్రారంభించిన జాతీయ ఉద్యమమని ఆయన అన్నారు. విద్య, ఉపాధి, సమాన అవకాశాల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని, విద్యా వ్యవస్థలో సంస్కరణలు, యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, సీనియర్ నాయకులు జావీద్ అక్రమ్, ప్రీతం, ముస్తఫా, గోవర్ధన్, వహీద్ తదితరులు పాల్గొన్నారు.
