- ఓపీ సేవలలో ప్రొఫెసర్లు ఎక్కడ..?
- అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ల గైడెన్స్ ఏది..?
- ఓపీ సేవలన్నీ ఎస్ఆర్ లు, పీజీ విద్యార్థులే
- గాడి తప్పిన జీజీహెచ్ పాలన
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో వైద్య సేవలు నానాటికి తీసికట్టుగా మారుతుంది. ఒకప్పుడు ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం (వరంగల్) ఆసుపత్రుల తర్వాత అత్యధిక వైద్య సేవలు అందిన నిజామాబాద్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందని ద్రాక్షలా మారుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో నాల్గవ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రిలో సేవలు దొరక్క పేదలు ప్రైవేట్ బాట పడుతున్నారు. కొందరు సీనియర్లు జీజీహెచ్ పేషెంట్లను దర్జాగా సొంత ప్రాక్టీస్ కు తరలించుకుని రోగులను పీల్చీపిప్పి చేస్తున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించే విధంగా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వారు వైద్య విద్యార్థులకు బోధనతో పాటు జీజీహెచ్ లో పీజీ విద్యార్థులకు, ఎస్ఆర్ లకు గైడెన్స్ చేస్తూ వైద్య సేవలనుఅందించడంలో తోడ్పడాల్సిన ప్రొఫెసర్లు జీజీహెచ్ వైపు కన్నెత్తి చూడడం లేదు. అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు అయితే స్టేతస్కోప్ పట్టింది లేదు . . . ఆపరేషన్లకు డైరెక్షన్ చేసింది లేదన్న చందంగా పరిస్థితి మారింది.
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థులకు గైడెన్స్ చేయాల్సిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లు పీజీ విద్యార్థులపై భారం మోపి తప్పించుకుంటున్నారన్న వాదనలున్నాయి. కనీసం ఎస్ఆర్ లు విద్యార్థులకు దగ్గరుండి గైడెన్స్ చేయాల్సిన వారు థియేటర్ల వైపు కన్నెత్తి చూడడం లేదని వచ్చిన రెస్ట్ రూంలకు పరిమితమౌతున్నారన్న వాదనలున్నాయి. పీజీ విద్యార్థులే జీజీహెచ్ భారాన్ని మోస్తున్నామని వాపోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా సెలవుల్లోనూ పని చేయాల్సి వస్తుందని ప్రొఫెసర్లను, అసిస్టెంట్, అసోసియేట్ ఫ్రొఫెసర్లను అడుగుదామంటే మార్కుల పేరుతో ఎక్కడ కొర్రీలు పెడుతారోనని సైలెంట్ గా బాధలు భరిస్తున్నారు. ఏడంతస్తుల మేడలో 750 పడకల ఆసుపత్రిలో నిత్యం 1500 మందికి తగ్గకుండా ఓపీ వస్తున్నా ఓపికగా వైద్య సేవలను చేస్తున్నది పీజీ విద్యార్థులే కావడం విశేషం. సీనియర్ రెసిడెంట్లుగా, ఆర్ఎంవోలుగా ఇతర విభాగాలను కూడా తామే కష్టపడి పని చేసే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఆసుపత్రిలో పని చేయడమే కాకుండా కొందరు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ లో తప్పనిసరిగా పని చేయాల్సిన పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు. అధికారులు చెప్పినట్లు వినకపోతే ఇంటర్నల్ మార్కుల కోతతో పాటు తమపై అధికారులకు ఎక్కడ ఫిర్యాదులు చేస్తారోనని కిక్కురుమనకుండా పని చేస్తున్నామని మరికొందరు చెబుతున్నారు.
నిజామాబాద్ జీజీహెచ్ లో సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా అధికారులు లేకనే వైద్యం అందని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా క్యాథలబ్ (గుండె సంబంధిత) పరీక్షలు నిర్వహించే యంత్రాలు ఉన్నా కార్డియాలజిస్టు లేడని దాని సేవలకు మూలకుపడ్డాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన ఎంసీహెచ్ (మధర్ అండ్ చైల్డ్ కేర్ హెల్త్ సెంటర్) సేవలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదరం రాజనర్సింహా డిసెంబర్ లో ప్రారంభించిన సెప్టెంబర్ వరకు ప్రారంభానికి నోచుకోలేదు. ఇటీవల కాలంలో అక్కడ ఓపీ సేవలు ప్రారంభించారు. ఇన్ పేషెంట్ సేవలకు ఎన్ని రోజులు పడుతుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. జీజీహెచ్ నుంచి ప్రతి శనివారం , ఆదివారాల్లో పేషెంట్లను ఆసుపత్రిలో పని చేస్తున్న ప్రొఫెసర్లు మొదలుకుని అసోసియేట్ ప్రొఫెసర్ల వరకు తమ సొంత ప్రాక్టీస్ కు బహిరంగంగానే తరలించుకుపోతున్నారు. ఒకప్పుడు సూపర్ స్పెషాలిటీ సేవలు అత్యాధునిక సర్జరీలతో కళకళలాడిన జీజీహెచ్ లో సంబంధం లేకపోయినా ఎంఆర్ఐ పరీక్షలు రాయడం అధికారులకే చెల్లింది. అందులోనూ మతలబు లేకపోలేదు. జీజీహెచ్ ఎంఆర్ఐ లేకపోవడంతో దాని వంకతోనే పేషెంట్లను ప్రైవేట్ కు తరలించి దండిగా ఫీజులు గుంజుతున్నారని ఆసుపత్రి అంతా కోడై కూస్తోంది. కొందరు హెచ్ వోడీల ఆసుపత్రులన్నీ గవర్నమెంట్ ఆసుపత్రి పేషెంట్లతోనే కళకళలాడుతుందంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు ఈగలు, దోమలు లేని ఆసుపత్రుల్లో పేషెంట్ల కళకళ వెనుక జీజీహెచ్ పేషెంట్లు రావడమే కారణమన్న వాదనలున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు హాజరయ్యే వారి ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల అటెండెన్స్ అంతా బయోమెట్రిక్ ( ఫేస్ రికగ్నైజేషన్) ద్వారా జరుగాల్సి ఉంది. కానీ అధికారులు పాత పద్దతిలోనే చేస్తూ వారికి కొమ్ముకాస్తున్నారన్న వాదనలున్నాయి. కొందరు హైదరాబాద్ కే పరిమితమైతే అధికారుల తనిఖీల విషయాన్ని లీక్ చేసి సరైన సమయంలో రప్పించి వారు విధుల్లో ఉన్నారని అధికారుల కళ్ళుగప్పుతున్నారన్న వాదనలున్నాయి. అటెండెన్స్ వెనుక ఆర్థికపరమైన లావాదేవిలు ఉన్నాయని అందుకే అధికారుల హాజరును ఎవ్వరు పట్టించుకోరని విమర్శలు లేకపోలేదు.