. . . రాజకీయ పార్టీలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం విషయంలో రాజకీయ పార్టీలు జాప్యం చేయకుండా, బీ.ఎల్.ఏ ల నియామకం జాబితాను నిర్ణీత ఫార్మాట్ లో సత్వరమే అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అమలులో బీ.ఎల్.ఏ ల పాత్ర ఎంతో క్రియాశీలకం అయినందున వారి నియామకంలో తాత్సారం తగదని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఈ.ఆర్.ఓలు, ఏ.ఈ.ఆర్.ఓలతో కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అమలు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. పారదర్శతతో కూడిన ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్.ఐ.ఆర్ ను అమలు చేస్తోందని, ఈ మేరకు నిర్ణీత షెడ్యూల్ ను కూడా వేలువరించిందని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘంచే గుర్తింపు కలిగిన అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకుని, నిర్ణీత ఫార్మాట్ లో వారి వివరాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఈ.ఆర్.ఓలను ఆదేశించారు. బీ.ఎల్.ఏల నియామకం కోసం ఇప్పటికే రాజకీయ పార్టీలను లిఖిత పూర్వకంగా కోరినప్పటికీ, ఇంకనూ వివరాలు అందించలేదని అన్నారు. కేవలం ఒక పార్టీ మాత్రమే రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బీ.ఎల్.ఏ ల వివరాలు సమర్పించిందని తెలిపారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ అమలుకు సంబంధించి బీ.ఎల్.ఏ లకు శిక్షణ తరగతులు నిర్వహించాల్సి ఉందని, అంతేకాకుండా ముసాయిదా ఓటరు జాబితాలోని అంశాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, బీ.ఎల్.ఏలు వాటిని ప్రస్తావించేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ సూచించారు. బీ.ఎల్.ఏల తక్షణ నియామకం ఆవశ్యకతను గుర్తిస్తూ, ఆయా పార్టీలు వెంటనే నియామక జాబితాను అందించాలని అన్నారు. ఈ.ఆర్.ఓల స్థాయిలో ప్రతీ వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ అమలు తీరు గురించి వారికి వివరాలు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బీ.ఎల్.ఓలు ప్రతి ఇంటిని సందర్శించి ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు. బీ.ఎల్.ఓ లకు సహకారం అందించేందుకు వీలుగా వాలంటీర్లను సమకూర్చాలని, చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్ళిన, రెండు చోట్ల పేర్లు కలిగిన ఓటర్లను మ్యాపింగ్ సందర్భంగా ఖచ్చితంగా గుర్తించేలా చూడాలన్నారు. తప్పులు లేకుండా ఎన్యుమరేషన్ ఫారం ఎలా నింపాలి అనే దానిపై బీ.ఎల్.ఓలకు సమగ్రంగా అర్ధమయ్యే రీతిలో శిక్షణ అందించాలని ఆదేశించారు. అన్ని పోలింగ్ బూత్ ల పరిధిలో వీ.ఐ.పీలు, వీ.వీ.ఐ.పీ ఓటర్లు ఉంటే, వారి మ్యాపింగ్ పూర్తయ్యిందా లేదా అన్నది ఈ.ఆర్.ఓలు స్వయంగా పరిశీలన జరపాలని సూచించారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ అమలు తీరు, ప్రగతి గురించి రోజువారీగా ఆన్లైన్ లో వివరాలు పొందుపర్చాల్సి ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని సాంకేతిక సిబ్బం దిని నియమించుకోవాలని తెలిపారు. మ్యాపింగ్ లో పొరపాట్లకు తావులేకుండా పక్కాగా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్.డీ.ఓ రాజేంద్రకుమార్, బాన్సువాడ ఆర్.డీ.ఓ రవీందర్ రెడ్డి, బోధన్ ఆర్డీఓ విజయ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏ.ఈ.ఆర్.ఓలు పాల్గొన్నారు.