Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 September 2025, 4:33 pm Posted by : ramakrishna

వర్షపు నీటిని తట్టుకునేలా డ్రైనేజీ వ్యవస్థ ఉండాలి

  • తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఎం.శ్రీనివాస్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతుంది కార్పొరేషన్ లు ,మున్సిపాలిటీల సంఖ్య పెరిగింది కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి తగినన్ని నిధులు కేటాయింపులు లేక మున్సిపాలిటీల అభివృద్ధి పూర్తిగా పడకేసింది. కుండపోతగా కురుస్తున్న వర్షాలను తట్టుకునేలా డ్రైనేజీ వ్యవస్థ లేదని దీని మూలంగా నగరాలు పట్టణాలు మినీ వాటర్ బండ్ ల మారిపోయి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శనివారం పెన్షనర్స్ భవన్లో జరిగిన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు ఇంకా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలన్నీ స్థానిక పట్టణ ప్రభుత్వాలే, ఈ స్థానిక ప్రభుత్వాలకు విధులతోపాటు తగినన్ని నిధులు కూడా కేటాయించాలి, కేరళ రాష్ట్రంలో మాదిరిగా పట్టణ స్థానిక సంస్థలను స్వతంత్రంగా పనిచేసేలా అధికారాలు, నిధులు ఇవ్వాలని ఆయన అన్నారు. -ఇటీవల వర్షాలు వరదల కారణంగా అనేక నగరాలు పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, పట్టణాల్లో వరద నీటి డ్రైనేజీ వ్యవస్థ సరిపడ లేకపోవడం కొన్ని పట్నాలకు అసలే డ్రైనేజీలు లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. వరదలను తట్టుకునేలా పట్టణాలను నిర్మించాల్సిన అవసరం ఉందని దీనిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో 100 నగరాలను ఎంపిక చేసుకొని స్మార్ట్ సిటీలు గా అభివృద్ధి చేస్తామని దశాబ్ద కాలం క్రితం ప్రకటించిందనీ, నేటికీ ఒక్క నగరం కూడా స్మార్ట్ సిటీ గా మారలేదనీ,చిన్నపాటి వర్షం వస్తే తట్టుకునే స్థితి లేదు, ఇవేమీ స్మార్ట్ సిటీలు? అని ఆయన ప్రశ్నించారు. -పట్టణాల అభివృద్ధికి తయారు చేస్తున్న మాస్టర్ ప్లాన్లు వాస్తవ పరిస్థితి కనుగునంగా, ప్రజల సమస్యలు పరిష్కరించేలా లేవనీ కన్సల్టెన్సీల జేబులు నింపడానికి పనికి వస్తున్నాయనీ ఆయన అన్నారు.ప్రజల భాగస్వామ్యంతోనే మాస్టర్ ప్లాన్లు తయారు జరగాలనీ ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవినీతి కూడా తారాస్థాయిలో పెరుగుతున్నది, అభివృద్ధి పనులు పూర్తిగా నాణ్యత కొరవడి కుప్ప కూలిపోతున్నాయి, అవినీతికి వ్యతిరేకంగా నగరా ప్రజానీకం ఐక్యంగా కదలాలి. ఆకుల ప్రసాద్ అధ్యక్షత వహించిన ఈ సభలో కార్యదర్శి కే రామ్మోహన్ రావు, షేక్ హుస్సేన్, మల్లేష్ రెడ్డి, సబ్బని లత, ఈవీఎల్ నారాయణ, సాదుద్దీన్ ,జి నరేందర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.