Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 August 2025, 3:04 pm Posted by : ramakrishna

అన్ని పార్టీల్లోనూ ఏదో ఒక వివాదం

బీఆర్ఎస్ పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు

ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, బతుకమ్మ:   అన్ని పార్టీల్లోనూ ఏదో ఒక వివాదం నడుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యనించారు.  సీఎం రేవంత్‌రెడ్డి ఏదైనా మాట్లాడితే.. అరగంటలోనే రాజగోపాల్‌రెడ్డి ఖండిస్తారని, బండి సంజయ్‌కు డైరెక్టుగా ఈటల వార్నింగ్‌ ఇస్తారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్ లో  బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో ఆదివారం  హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్ నాయకులతో కవిత సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. సింగరేణి తెలంగాణకు ప్రకృతి ఇచ్చిన వరమన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం పనిచేస్తామన్నారు. తెలంగాణలో హెచ్.ఎం.ఎస్ స్వతంత్ర కార్మిక సంఘంగా ఉందని, ఈసంఘంతో కలిసి సింగరేణి జాగృతి పనిచేస్తుందన్నారు. సింగరేణి ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి అడ్డాగా మార్చుకుందన్నారు. సింగరేణిలో లిబరల్,లెఫ్ట్ సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయని, రాబోయే రోజుల్లో లెఫ్ట్ సంఘాలతో కలిసి పనిచేస్తామన్నారు. దసరా తర్వాత సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో జాగృతి, హెచ్.ఎం.ఎస్ కలిసి యాత్ర నిర్వహించి కార్మికులకు భరోసా కల్పిస్తాయన్నారు.

తెలంగాణ ఉద్యమంలో కవిత క్రియాశీలకంగా పనిచేశారు :  హెచ్.ఎం.ఎస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్

తెలంగాణ ఉద్యమంలో కవిత క్రియాశీలకంగా పనిచేశారని  హెచ్.ఎం.ఎస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ అన్నారు. తెలంగాణ జాగృతికి గుర్తింపు తీసుకువచ్చారన్నారు.  సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉండి కార్మికుల హక్కుల కోసం పనిచేశారన్నారు. జాగృతి,హెచ్.ఎం.ఎస్ కలిసి సింగరేణిని రక్షించుకుంటామన్నారు. సింగరేణి జాగృతి,హెచ్.ఎం.ఎస్ కలవకుండా కొంతమంది కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.  దళారుల చేతుల నుంచి సింగరేణిని కాపాడాలన్నారు.   గతంలో సింగరేణిలో నోటిఫికేషన్ ఇస్తే మహిళలకు అవకాశం లేదన్నారు.  ఇప్పుడు సింగరేణిలో పురుషులతో సమానంగా మహిళలకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు.


There is some kind of controversy in all parties