సంక్షేమానికి కేరాఫ్ గా కాంగ్రెస్ పాలన
హైదరాబాద్ బ్రాండ్ ని మరింత ముందుకు తీసుకెళ్తాం
కాళేశ్వరం నీరు లేకున్నా దిగుబడిలో రికార్డ్
79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రేవంత్
హైదరాబాద్, బతుకమ్మ : గోదావరి, కృష్ణా జలాల విషయం లో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన వాటా సాధించేవరకు ఎవరి బెదిరింపులకు లొంగేదీ లేదన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. అహింసా పద్ధతిలో మహాసంగ్రామం గెలిచామని అన్నారు. కాళేశ్వరం నుంచి నీరు రాకపోయినా ధాన్యం దిగుబడిలో రికార్డు సాధించామన్నారు. గతేడాది ఆగస్టు 15న రూ. రెండు లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టామన్నారు. విత్తనాలు వేసే నాటికి రైతుల ఖాతాలో రైతు భరోసా జమ చేశామన్నారు. తొమ్మిది రోజుల్లోనే రూ. తొమ్మిది వేల కోట్లు వేశామన్నారు. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు సేకరిస్తున్నామన్నారు. 1947 ఆగస్టు 15న నెహ్రూ చేసిన ప్రసంగం దేశం మొత్తాన్ని ఏకం చేసిందన్నారు. మహనీయుల స్ఫూర్తితో తెలంగాణను అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ ముందడుగు వేస్తున్నామన్నారు. ఎన్నో శతాబ్దాలుగా హైదరాబాద్ అంటే ఒక బ్రాండ్ ఉందని, ఈ బ్రాండ్ ను మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. సంక్షేమానికి కేరాఫ్ గా కాంగ్రెస్ పాలన నిలిచిందన్నారు.
