Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 5:39 pm Posted by : ramakrishna

మొబైల్ పోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

 

. . . 20 రోజుల్లోనే 200 ఫోన్ల రికవరీ

 

. . . కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

మొబైల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అప్పగించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వెల్లడించారు. డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ కేవలం సమాచార సాధనం మాత్రమే కాదని, బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత ఫొటోలు, కీలకమైన డేటా అందులో ఉంటాయని ఎస్పీ పేర్కొన్నారు. ఫోన్ పోయినప్పుడు వ్యక్తిగత భద్రత, గోప్యతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నందున మొబైల్ ఫోన్ల రికవరీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనే ఉద్దేశంతో ఇన్‌స్పెక్టర్ సంపత్ పర్యవేక్షణలో ఆర్‌ఎస్‌ఐ బాలరాజు, ఐదుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రతినెలా సగటున 150కు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తోందని చెప్పారు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా కేవలం 20 రోజుల్లోనే సుమారు రూ.32 లక్షల విలువైన 200 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు రూ.1.59 కోట్ల విలువైన 994 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గత ఏడాది సైతం సుమారు రూ.3 కోట్ల విలువైన 1,834 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు గుర్తుచేశారు. సీఈఐఆర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కామారెడ్డి జిల్లాలో మొత్తం 5,275 మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి గుర్తించగా, సుమారు రూ.8.44 కోట్ల విలువైన ఫోన్లను బాధితులకు విజయవంతంగా అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు. మొబైల్ ఫోన్ల రికవరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

. . . ఫోన్ పోయిన వెంటనే అప్రమత్తంగా ఉండాలి

మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ప్రజలు కాలయాపన చేయకుండా సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. ఫోన్‌లోని సిమ్ కార్డును వెంటనే బ్లాక్ చేయడంతో పాటు, సీఈఆర్ పోర్టల్‌లో ఫోన్‌కు సంబంధించిన ఐఎంఈఐ నంబర్‌ను బ్లాక్ చేయాలని కోరారు. పోయిన మొబైల్ ఫోన్లను ఇతరులు దుర్వినియోగం చేసి సైబర్ మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున, గుర్తుతెలియని లింకులు, అనుమానాస్పద ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. రికవరీ అయిన మొబైల్ ఫోన్లను పొందేందుకు బాధితులు సంబంధిత ధ్రువపత్రాలతో కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్‌ఎస్‌ఐ బాలరాజు ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.

 

There is no need to worry if you lose your mobile phone.