Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 8:35 pm Posted by : ramakrishna

యూరియా కొరతపై ఆందోళన అవసరం లేదు

 

. . . మండల వ్యవసాయ అధికారి

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

మోర్తాడ్ మండలంలోని రైతులు యూరియా లభ్యతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. రైతులకు ఎరువుల పంపిణీని పారదర్శకంగా, సమానంగా నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలో మొత్తం 8,200 మంది రైతులు ఉండగా, జూన్ 10 నుంచి ప్రారంభమైన యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 4,033 మంది రైతులు యూరియాను బుక్ చేసుకున్నారు. రైతులు మొత్తం 10,400 యూరియా బ్యాగులను బుక్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుత వానాకాల పంటల సాగుకు మండలంలో సుమారు 50,000 యూరియా బ్యాగులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే, మండలానికి అవసరమైన మేర యూరియా సరఫరా రోజువారీగా అందుతుండటంతో రైతులు కొరతపై అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా రైతుల సంఖ్య, సాగు విస్తీర్ణం, పంట అవసరాలను పరిగణనలోకి తీసుకుని యూరియాను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభ దశలోనే ఉన్నందున రైతులు తొందరపడి అధిక మొత్తంలో యూరియాను బుక్ చేయకుండా, పంట అవసరాలకు అనుగుణంగా దశలవారీగా బుక్ చేసుకోవాలని కోరారు. మండలాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి ఎరువుల బుకింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నందున రైతులు మండలంలోని రెండు సహకార సంఘాలు (సొసైటీలు) మరియు ప్రైవేట్ డీలర్ల వద్ద కూడా యూరియాను బుక్ చేసుకోవచ్చని వివరించారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా ప్రతి రైతుకు సమాన అవకాశాలు కల్పిస్తూ ఎరువులు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఈ వానాకాల సీజన్‌లో రైతులందరికీ సరిపడా యూరియా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మండల వ్యవసాయ అధికారి తెలిపారు.

 

There is no need to worry about the urea shortage.