హైదరాబాద్, బతుకమ్మ: ఓ వైపు ఎండ తీవ్రత పెరుగుతుండడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా భారత వాతావరణం విభాగం చల్లని కబురు అందించింది. ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
గత పది రోజుల వ్యవధిలో వాతావరణంలో అనూహ్యంగా మార్పులు చోటు చేసుకుని ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే రాష్ర్టంలోని నిజామాబాద్ తోపాటు కామారెడ్డి, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, వికారాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో వర్షం కురుస్తుందని వాతావరణం విభాగం ప్రకటించడంతో ప్రజలకు చల్లని కబురు అందినట్లయింది.
మరో వైపు పంటలు చేతికి వచ్చిన సమయంలో వర్షం కురిస్తే తమపరిస్థితి ఏమిటని రైతులు ఆందోళనచెందుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమై ధాన్యం ఆరబోస్తున్నారు.