. 12వ తేదీ లోగాముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపాలి
నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలో మొత్తం 545 గ్రామపంచాయతీలు, 5022 వార్డులు ఉండగా, 5053 పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే ఈనెల 12వ తేదీలోగా తెలుపాలని రాజకీయ పార్టీలను కోరారు. కలెక్టరేట్ లోని తన చాంబర్ లో మంగళవారం ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 7వ తేదీన జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీల్లో ముసాయిదా జాబితాను ప్రకటించామని గుర్తు చేశారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో 180 జీపీల పరిధిలో 1766 వార్డులకు గాను 1786 పోలింగ్ కేంద్రాలు, బోధన్ డివిజన్ పరిధిలో 152 జీపీల పరిధిలో 1354 వార్డులకు గాను 1354 పోలింగ్ కేంద్రాలు, నిజామాబాద్ డివిజన్ పరిధిలో 213 జీపీలకుగాను 1902 వార్డులకు గాను 1913 పోలింగ్ కేంద్రాలను ముసాయిదా జాబితాలో పొందుపర్చినట్లు వివరించారు. 12వ తేదీన అన్ని మండలాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీవోలు నిర్వహించే సమావేశంలోనూ అభ్యంతరాలు స్వీకరిస్తారని తెలిపారు. 13వ తేదీన సమస్యలను పరిష్కరించి 17వ తేదీన మండలాలు, గ్రామ పంచాయతీల తుది పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటిస్తామన్నారు. సమావేశంలో ఇన్ చార్జి డీపీవో శ్రీనివాస్, ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.